Delhi CM Rekha: ఢిల్లీలో ముఖ్యమంత్రి రేఖా గుప్తాపై ఇటీవల జరిగిన దాడి కేసులో పోలీసులు దర్యాప్తును మరింత ముమ్మరం చేశారు. ఈ ఘటనలో ప్రధాన నిందితుడు సకారియా రాజేష్‌భాయ్ ఖిమ్జీని అదుపులోకి తీసుకున్న తర్వాత, అతని స్నేహితుడు తహసీన్ సయ్యద్‌ను కూడా గుజరాత్‌లోని రాజ్‌కోట్ నుంచి అరెస్టు చేశారు. దాడి వెనుక ఉన్న పూర్తి వివరాలను వెలికితీయడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
సీఎం రేఖా గుప్తా ‘జన్ సున్వాయ్’ కార్యక్రమానికి ఆటోడ్రైవర్ అయిన సకారియా ఫిర్యాదుదారుగా ముసుగు వేసుకుని వచ్చాడు. తన సమస్యను తెలియజేసేందుకు వచ్చినట్లు నమ్మించి, ఒక్కసారిగా సీఎంపై దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో ఆమె తల, భుజం, చేతులకు గాయాలయ్యాయి.
దాడికి కారణం: పోలీసులు సకారియాను ప్రశ్నించగా, తన దాడి వెనుక ఉన్న అసలు కారణాన్ని వెల్లడించాడు. వీధి కుక్కలను తరలించాలని తాను చాలాసార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ, సీఎం పట్టించుకోకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు. ముందుగానే ప్లాన్: సకారియా ముందుగా కత్తితో దాడి చేయాలని అనుకున్నాడని, అయితే సీఎం నివాసం వద్ద భద్రత ఎక్కువగా ఉండటంతో ఆ ప్రణాళికను విరమించుకున్నానని పోలీసులకు చెప్పాడు. దాడికి ముందు సుప్రీంకోర్టు వద్ద కూడా భద్రతను పరిశీలించి వెనక్కి వచ్చేశానని తెలిపాడు.
Also Read: Korutla Jagityala BJP: కోరుట్ల, జగిత్యాల వైపు కమలనాథులు కన్నెత్తి చూడట్లేదా?
మిత్రుడి పాత్ర: సకారియాకు అతని మిత్రుడు తహసీన్ సయ్యద్ సహకరించినట్లు పోలీసులు గుర్తించారు. దాడికి ముందు తహసీన్, సకారియాకు రూ. 2,000 పంపించినట్లు, అంతేకాకుండా దాడికి ముందు సీఎం నివాసానికి సంబంధించిన వీడియోలను కూడా సకారియా తన స్నేహితుడికి పంపినట్లు దర్యాప్తులో తేలింది. తహసీన్‌ను ప్రస్తుతం ఢిల్లీకి తీసుకువచ్చారు.
సకారియా సాధారణ ఆటోరిక్షా డ్రైవర్ కాదు, అతనికి విస్తృతమైన నేర చరిత్ర ఉంది. రాజ్‌కోట్‌లోని భక్తినగర్ పోలీస్ స్టేషన్‌లో 2017 నుంచి 2024 వరకు అతనిపై ఐదు దాడి కేసులు, మద్యం కేసులు నమోదయ్యాయి. 2017లో ఒక వ్యక్తి తలపై బ్యాట్‌తో కొట్టాడు. 2022లో తన భార్యతో గొడవపడి, కుటుంబ సభ్యులను భయపెట్టేందుకు బ్లేడుతో తలపై గాయాలు చేసుకున్నాడు. దీనికి తొమ్మిది కుట్లు పడ్డాయి.
సకారియా తన చర్యల వెనుక ఒక నిరసన ప్రణాళిక ఉందని కూడా పోలీసులకు వెల్లడించాడు. వీధి కుక్కల సమస్యపై అన్నా హజారే అవినీతి నిరసన మాదిరిగా రామ్‌లీలా మైదానంలో నిరసన చేపట్టాలని తాను యోచించినట్లు తెలిపాడు. పోలీసులు అతని మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ పరీక్షకు పంపారు, ఏదైనా ముఖ్యమైన సమాచారం తొలగించబడిందా అని పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం నిందితుడు ఐదు రోజుల పోలీస్ కస్టడీలో ఉన్నాడు. ఈ కేసులో మరింత లోతుగా దర్యాప్తు జరుగుతోంది. దాడి అనంతరం సీఎం రేఖా గుప్తాకు సీఆర్పీఎఫ్ జవాన్లతో జడ్ కేటగిరీ భద్రత కల్పించారు. కానీ, ఇటీవల దానిని తొలగించి, మునుపటిలాగే ఢిల్లీ పోలీసులు భద్రత కల్పిస్తారని అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఈ ఘటనపై దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది.