Falcon Scam: ప్రజలను నమ్మించి వందల కోట్ల రూపాయల మేర మోసానికి పాల్పడిన ‘ఫాల్కన్’ స్కామ్ కేసులో ఎట్టకేలకు తెలంగాణ పోలీసులకు కీలక విజయం లభించింది. ఈ భారీ ఆర్థిక కుంభకోణంలో ప్రధాన నిందితుడు, ఫాల్కన్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ (MD) అమర్‌దీప్‌ను పోలీసులు ముంబైలో అదుపులోకి తీసుకున్నారు. డిజిటల్ డిపాజిట్ల పేరుతో సుమారు 850 కోట్ల రూపాయల మేర సామాన్యుల నుంచి వసూలు చేసి పరారైన ఆయనను, గల్ఫ్ దేశాల నుంచి తిరిగి భారత్‌కు వస్తుండగా ఇమ్మిగ్రేషన్ అధికారులు గుర్తించారు. అమర్‌దీప్‌పై ఇప్పటికే లుక్ అవుట్ సర్క్యులర్ (LOC) జారీ కావడంతో, అతను ముంబై విమానాశ్రయంలో అడుగుపెట్టిన వెంటనే అధికారులు తెలంగాణ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన అక్కడికి చేరుకున్న ప్రత్యేక బృందం నిందితుడిని అరెస్ట్ చేసింది.
Also Read: Telangana: సంక్రాంతి సెలవులు ప్రకటించిన ప్రభుత్వం.. ఎన్ని రోజులంటే.?
విచారణ వివరాల ప్రకారం, అమర్దీప్ తన కంపెనీ ద్వారా రకరకాల ఆశలు చూపి ప్రజలను వంచించినట్లు తెలుస్తోంది. యాప్ ఆధారిత డిజిటల్ డిపాజిట్లు, బహుళజాతి కంపెనీల్లో (MNC) పెట్టుబడులు, షేర్ మార్కెట్లో అధిక లాభాలు వస్తాయంటూ నమ్మబలికి భారీ మొత్తంలో నగదు వసూలు చేశారు. అయితే ఈ మోసం బయటపడగానే, అమర్దీప్ తన భార్యతో కలిసి ప్రత్యేక చార్టెడ్ విమానంలో దుబాయ్‌కు పారిపోయారు. అప్పటి నుండి పరారీలో ఉన్న ఆయన కోసం పోలీసులు అంతర్జాతీయ స్థాయిలో గాలింపు చేపట్టారు. ఈ క్రమంలోనే ఎట్టకేలకు ఆయన పోలీసుల చిక్కారు.
ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఫాల్కన్ కంపెనీ సీఈఓతో పాటు అమర్దీప్ సోదరుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు అమర్దీప్ కూడా ఇప్పుడు దొరకడంతో, బాధితుల నుంచి వసూలు చేసిన 850 కోట్ల రూపాయలు ఎక్కడికి మళ్లించారు? దీని వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారు? అనే కోణంలో విచారణ మరింత వేగవంతం కానుంది. అమర్‌దీప్‌ను ముంబై నుంచి హైదరాబాద్‌కు తీసుకువచ్చి కోర్టులో హాజరుపరచడానికి పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. అప్పనంగా లాభాలు వస్తాయంటూ వచ్చే ఇలాంటి ఆకర్షణీయమైన ప్రకటనల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
