JC Prabhakar Reddy: అనంతపురం జిల్లా తాడిపత్రిలో మళ్లీ రాజకీయ వేడి పెరిగింది. టీడీపీ నేత, మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి – వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయికి చేరుకుంది.
హైకోర్టు అనుమతితో తాడిపత్రిలోకి ప్రవేశించేందుకు కేతిరెడ్డి పెద్దారెడ్డి సిద్ధమవుతుండగా, జేసీ ప్రభాకర్ రెడ్డి సవాల్ విసిరారు. “కేతిరెడ్డి.. దమ్ముంటే రా.. తేల్చుకుందాం” అంటూ జేసీ పరోక్షంగా ఢీకొట్టారు. ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో కేతిరెడ్డి, అతని అనుచరులు చేసిన దౌర్జన్యాలకు తాడిపత్రి ప్రజలకు సమాధానం చెప్పాలని జేసీ డిమాండ్ చేశారు.
జేసీ వ్యాఖ్యలు
-
కేతిరెడ్డిపై తనకు వ్యక్తిగత కక్ష ఏమీ లేదని స్పష్టం చేశారు.
-
గతంలో టిడిపి నాయకులకూ హైకోర్టు ఆదేశాలు ఉన్నా, కేతిరెడ్డి అనుమతించలేదని గుర్తుచేశారు.
-
“చట్టం మీకేనా? మాకు వర్తించదా?” అంటూ ప్రశ్నించారు.
-
తాడిపత్రిలోకి రావడం కన్నా ముందుగా అక్రమ నిర్మాణాలపై వివరణ ఇవ్వాలని సూచించారు.
-
“మాకు అప్పుడూ గన్‌మెన్ లేరు.. ఇప్పుడూ లేరు. కానీ కేతిరెడ్డి మాత్రం ఏకే 47లతో గన్‌మెన్‌ల మధ్య తిరుగుతున్నారు” అంటూ ఎద్దేవా చేశారు.
ఇది కూడా చదవండి: Emergency Landing: గాల్లో ఉండగానే విమానంలో మంటలు.. 273 మంది ప్రయాణికులు
కేతిరెడ్డి ప్రణాళిక
హైకోర్టు ఆదేశాల ప్రకారం, ఆగస్టు 18న ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య కేతిరెడ్డి పెద్దారెడ్డిని భారీ పోలీసు భద్రత నడుమ తాడిపత్రికి తీసుకెళ్లాలని పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు వచ్చాయి. కోర్టు ధిక్కరణ కేసులో గతంలో తమ ఆదేశాలను పాటించకపోవడంపై అనంతపురం పోలీసులపై అసంతృప్తి వ్యక్తం చేసిన హైకోర్టు, ఈసారి కఠినంగా ఉండాలని సూచించింది.
పట్టణంలో అలజడి
ఇక మరోవైపు జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రిలో ధ్యాన శివుడి విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. దీనికి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు హాజరవ్వాలని పిలుపునివ్వడంతో, పట్టణంలో శాంతిభద్రతల విషయంలో ఉద్రిక్తత నెలకొనే అవకాశం కనిపిస్తోంది.
పోలీసులు హై అలర్ట్
ఇరువర్గాల మధ్య “ఢీ అంటే ఢీ” వైఖరి కారణంగా తాడిపత్రిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే అవకాశం ఉన్నందున, పోలీసులు భారీ బలగాలను మోహరించారు.