Kesineni chinni: తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు చేసిన ఆరోపణలపై విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని తీవ్రంగా స్పందించారు.కొలికపూడి తనపై చేసిన రూ.5 కోట్లు డిమాండ్ ఆరోపణలు నిరాధారమని, “మొన్నటి వరకు నన్ను దేవుడన్నారు… ఇప్పుడు దెయ్యంలా ఎందుకు కనిపిస్తున్నానో ఆయనే చెప్పాలి” అంటూ చిన్ని సూటిగా ప్రశ్నించారు.
గత ఎన్నికల్లో తిరువూరు టికెట్ కోసం కేశినేని చిన్ని రూ.5 కోట్లు అడిగారని కొలికపూడి చేసిన సంచలన వ్యాఖ్యలతో టీడీపీ రాజకీయాల్లో కలకలం రేగింది. దానికి బలంగా బ్యాంక్ స్టేట్‌మెంట్‌ను వాట్సాప్ స్టేటస్‌గా పెట్టి మరింత వివాదాన్ని రగిలించారు.
ఈ పరిణామాల నేపథ్యంలో తిరువూరులో జరిగిన ఎంపీ చిన్ని పర్యటనకు ఎమ్మెల్యే కొలికపూడి హాజరుకాలేదు.
ఈ వివాదంపై స్పందించిన చిన్ని — “ఈ వ్యవహారం పార్టీ అధిష్ఠానం దృష్టికి వెళ్లింది, వారు తీసుకునే నిర్ణయానికే నేను లోబడతాను” అన్నారు.
తాను వైసీపీ నేతలతో అంటకాగే వ్యక్తి కాదని, అలాగే చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేశ్‌లను విమర్శించే వారిని శత్రువులుగా పరిగణిస్తానని స్పష్టం చేశారు.
తిరువూరులో తాను గత నాలుగేళ్లుగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నానని పేర్కొన్నారు.
మొత్తం మీద, ఎంపీ కేశినేని చిన్ని – ఎమ్మెల్యే కొలికపూడి మధ్య వాగ్వాదం టీడీపీ అధిష్ఠానానికి చేరడంతో, పార్టీ ఎలా స్పందిస్తుందన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది