Kerala: కేరళలోని తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం ఉదయం తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. విమానాశ్రయ అధికారులకు వచ్చిన ఈ-మెయిల్ ద్వారా బాంబు బెదిరింపు సంచలనం రేపింది. దీనితో అధికారులు అప్రమత్తమై తక్షణమే భద్రతా చర్యలను ముమ్మరంగా చేపట్టారు.
విమానాశ్రయ కార్యాలయానికి వచ్చిన ఈ-మయిల్‌లో విమానాశ్రయంలో బాంబు పెట్టినట్లు పేర్కొన్నట్లు అధికారులు తెలిపారు. ఈ సమాచారం అందుకున్న వెంటనే ఉన్నతాధికారులు, భద్రతా బలగాలను అప్రమత్తం చేశారు. ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకొని అదనపు భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.
బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్స్ రంగంలోకి దిగి విమానాశ్రయంలోని అన్ని టెర్మినల్స్‌తో పాటు అనుమానాస్పద ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నాయి. ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటూ, భద్రతా తనిఖీలు కొనసాగిస్తున్నట్టు అధికారులు తెలిపారు.
ఈ బెదిరింపు ఈ-మెయిల్ను గుర్తించేందుకు సైబర్ క్రైమ్ విభాగం దర్యాప్తు ప్రారంభించింది. అన్ని కోణాల్లో విచారణ చేపట్టిన భద్రతా సంస్థలు, పూర్తి స్థాయిలో విమానాశ్రయాన్ని తనిఖీ చేస్తున్నాయి. ప్రస్తుతం విమానాశ్రయం భద్రతా బలగాల పర్యవేక్షణలో ఉండగా, తనిఖీలు పూర్తయ్యే వరకు అప్రమత్తత కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు.
ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం త్వరలో వెలుగు చూడనుంది.