Keerthy Suresh: టాలీవుడ్ ‘మహానటి’ కీర్తి సురేష్ తన చిరకాల మిత్రుడు, ప్రియుడు ఆంటోనీ తట్టిల్‌ను వివాహం చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. అయితే, ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన ప్రేమ ప్రయాణం, పెళ్లి సమయంలో జరిగిన కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలను ఆమె పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, తమది 15 ఏళ్ల సుదీర్ఘ ప్రేమ బంధమని, ఒకానొక దశలో తమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోకపోతే సినిమాల్లో చూపించినట్లుగా ‘లేచిపోయి’ పెళ్లి చేసుకోవాలని కూడా నిర్ణయించుకున్నట్లు బాంబు పేల్చారు. తాము పారిపోయి వివాహం చేసుకుంటామని భావించామే తప్ప, ఇంత వైభవంగా అందరి సమక్షంలో ఒక్కటవుతామని అస్సలు ఊహించలేదని ఆమె పేర్కొన్నారు.
చివరికి పెద్దల అంగీకారంతో గోవా వేదికగా హిందూ, క్రైస్తవ సంప్రదాయాల ప్రకారం వీరి వివాహం అట్టహాసంగా జరిగింది. పెళ్లి వేడుకలోని భావోద్వేగ క్షణాల గురించి వివరిస్తూ, తాళి కట్టే ఆ 30 సెకన్ల సమయంలో తన మెదడు మొద్దుబారిపోయిందని, చుట్టూ ఏం జరుగుతుందో కూడా అర్థం కాలేదని కీర్తి చెప్పుకొచ్చారు. 15 ఏళ్ల నిరీక్షణ ఆ కొద్ది క్షణాల్లో ఒక అందమైన బంధంగా మారుతుంటే తన కళ్లలో ఆనందబాష్పాలు ఆగలేదని ఆవేదన చెందారు. ముఖ్యంగా ఎప్పుడూ ధైర్యంగా ఉండే ఆంటోనీ, మొదటిసారి తాళి కట్టే సమయంలో ఎమోషనల్ అవ్వడం తనను ఎంతగానో కదిలించిందని ఆమె వెల్లడించారు.
Also Read: Shruti Haasan: దుల్కర్ సినిమాలో శ్రుతి హాసన్ బోల్డ్ అవతార్!
సినిమాల్లోకి రాకముందే మొదలైన వీరి బంధం, లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్‌ను తట్టుకుని నిలబడి పెళ్లి పీటల వరకు చేరడం విశేషం. ప్రస్తుతం కీర్తి సురేష్ తన వైవాహిక జీవితాన్ని ఆస్వాదిస్తూనే, ‘తోట్టమ్’ వంటి వరుస సినిమాలతో కెరీర్ పరంగా కూడా బిజీగా గడుపుతున్నారు. తమ నివాసాన్ని ‘హౌస్ ఆఫ్ ఫన్’ అని పిలుచుకునే ఈ జంట, తమ వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకోవడంతో ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
