KCR: తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ ఇప్పుడు ఉత్కంఠభరితమైన మలుపులు తిరుగుతోంది. బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ విచారణకు సంబంధించి తాజాగా కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. మొదట ఇచ్చిన నోటీసు ప్రకారం ఆయన ఇవాళ (శుక్రవారం) మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు హాజరుకావాల్సి ఉంది.
సిట్‌కు కేసీఆర్ లేఖ:
ప్రస్తుతం రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల సందడి నెలకొనడం, పార్టీ అంతర్గత సమావేశాల్లో తాను ఎంతో బిజీగా ఉండటంతో ఇవాళ విచారణకు రాలేనని కేసీఆర్ సిట్ (SIT) అధికారులకు లేఖ రాశారు. తన షెడ్యూల్ దృష్ట్యా ఈ విచారణకు హాజరుకావడం కుదరదని ఆయన అందులో వివరించారు.
ఇది కూడా చదవండి: Virat Kohli: మాయమైన విరాట్ కోహ్లీ.. ట్విట్టర్ లో ట్రెండ్ చేస్తున్న అభిమానులు
మరో నోటీసుకు సిట్ సిద్ధం:
కేసీఆర్ చేసిన విజ్ఞప్తిని అధికారులు పరిశీలిస్తున్నారు. దీనిపై స్పందించిన సిట్, విచారణ కోసం రేపు (శనివారం) మరోసారి నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. ఆ నోటీసులో తదుపరి విచారణ ఎప్పుడు జరగాలి? ఎక్కడ జరగాలి? అనే విషయాలను స్పష్టంగా పేర్కొననున్నారు.
విచారణ ఎక్కడ? నందినగర్ లోనా.. ఫామ్‌హౌస్‌లోనా?
కేసీఆర్ వయసును దృష్టిలో ఉంచుకుని ఆయన పోలీస్ స్టేషన్‌కు రానక్కర్లేదని, ఆయన కోరుకున్న చోటే విచారిస్తామని అధికారులు ఇదివరకే వెసులుబాటు కల్పించారు. మొదట హైదరాబాద్‌లోని నందినగర్ నివాసంలో విచారణ జరపాలని అధికారులు భావించారు. అయితే, కేసీఆర్ ప్రస్తుతం ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో ఉంటున్నందున, విచారణ అక్కడే జరగాలని పార్టీ వర్గాలు కోరుతున్నాయి. దీంతో విచారణా స్థలంపై ఇప్పుడు సస్పెన్స్ నెలకొంది.
మున్సిపల్ ఎన్నికల వేళ మాజీ సీఎం కేసీఆర్‌ను ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారించడం రాజకీయంగా పెద్ద చర్చకు దారితీస్తోంది. సిట్ ఇచ్చే రెండో నోటీసులో అధికారులు ఎలాంటి గడువు విధిస్తారు? విచారణ ఎక్కడ జరుగుతుంది? అనే విషయాలపై రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.
