Kavitha: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే అసెంబ్లీకి వచ్చి, సాగునీటి ప్రాజెక్టుల వివాదాలపై మాట్లాడాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. ఒకవేళ ఆయన సభకు రాకపోతే, బీఆర్ఎస్ పార్టీని కాపాడటం ఆ దేవుడి వల్ల కూడా కాదని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం శాసనమండలి మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన ఆమె, రాష్ట్ర ప్రయోజనాల కోసం కేసీఆర్ తన గళాన్ని వినిపించాల్సిన అవసరం ఉందన్నారు.
ఇదే సమయంలో మాజీ మంత్రి హరీష్ రావు పేరు ఎత్తకుండానే కవిత పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ‘బబుల్ షూటర్’ను నమ్మడం వల్లే పార్టీకి ఇబ్బందులు వచ్చాయని, ఆయన వల్లే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనులు కుంటుపడ్డాయని వ్యాఖ్యానించారు. అలాగే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కూడా ఆమె మండిపడ్డారు. తెలంగాణ కోసం పోరాడిన కేసీఆర్‌ను ఉగ్రవాది కసబ్‌తో పోల్చడం, ఆయనను ఉరితీయాలనడం సరికాదని హితవు పలికారు. కేసీఆర్ పోరాటం వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు.
తన వ్యక్తిగత నిర్ణయాల గురించి మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ పదవికి తాను చేసిన రాజీనామాను ఆమోదించాలని మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని కోరినట్లు కవిత తెలిపారు. కేసీఆర్ ఎటువంటి తప్పు చేయకపోతే అసెంబ్లీకి వచ్చి ప్రజలకు సమాధానం చెప్పాలని ఆమె కోరారు. ఈ నెల 5 లేదా 6వ తేదీన సభలో మాట్లాడి, తాను రాజీనామా చేయడానికి గల పూర్తి కారణాలను వివరిస్తానని కవిత స్పష్టం చేశారు.
