KCR: తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నేటి నుంచి ప్రారంభమవుతున్నాయి. ఈ సమావేశాల్లో కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ కమిషన్ నివేదికపై చర్చ జరగనున్న నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సభకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. ప్రాజెక్టు నిర్మాణంలో అక్రమాలు జరిగాయని అధికార కాంగ్రెస్ ఆరోపణలు చేస్తుండగా, ఈ చర్చకు హాజరుకావడంపై కేసీఆర్ వెనుకడుగు వేసినట్లు తెలుస్తోంది.
అయితే కేసీఆర్ గైర్హాజరు వ్యూహాత్మకమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావుతో పాటు కీలక నేతలతో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. సభలో పార్టీ ఎటువంటి వ్యూహం అనుసరించాలో నేతలకు సూచనలు ఇచ్చారు.
కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలకు బలమైన ప్రతిస్పందన ఇవ్వాలని, ప్రాజెక్టు వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకురావాలని కేసీఆర్ ఆదేశించినట్లు సమాచారం. గతంలోలానే ఈసారి కూడా కాళేశ్వరం ప్రాజెక్టు ప్రయోజనాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సభలో ప్రదర్శించేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్‌ను అభ్యర్థించారు. హరీశ్ రావు ఈ అంశంపై సభలో ప్రధానంగా మాట్లాడనున్నారు.
సభ చర్చ కాళేశ్వరానికి మాత్రమే పరిమితం కాకుండా రాష్ట్ర ప్రజా సమస్యలపై దృష్టి సారించాలని కేసీఆర్ సూచించారు. యూరియా కొరత, వరదల ప్రభావం, సీజనల్ వ్యాధులు, పారిశుద్ధ్య సమస్యలు వంటి అంశాలను గళం విప్పి ప్రస్తావించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఆదేశాలు జారీ అయ్యాయి.
మొదటి రోజు సభలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపినాధ్ సంతాప తీర్మానంపై చర్చ జరుగుతుంది. కేసీఆర్ హాజరుకాకపోయినా పార్టీ తరపున కేటీఆర్, హరీశ్ నాయకత్వంలో ఎమ్మెల్యేలు వ్యూహాత్మకంగా వ్యవహరించనున్నారు. సమావేశాలు 15 రోజులు కొనసాగాలని బీఆర్ఎస్ కోరుతోంది.

