KCR: అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి పాలైంది. లోక్‌సభ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నది. అనంతరం ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బయటకు రావడమే మానేశారు. ఒకటి రెండు సార్లే అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొన్నారు. ఆ తర్వాత ఎర్రవల్లిలోని తన ఫాంహౌజ్‌కే పరిమితం అయ్యారు. కానీ, ఎప్పటికప్పుడు పార్టీ కార్యక్రమాలను పరిశీలిస్తూనే, దిశానిర్దేశం చేస్తున్నారు.
KCR: కేసీఆర్ బయటకు ఎప్పుడొస్తారనే అంశంపై ఇటు రాజకీయ వర్గాల్లో, అటు బీఆర్ఎస్ శ్రేణుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొన్నది. ఇటీవల ఉపరాష్ట్రపతి ఎన్నికలకు దూరంగా ఉండాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీని కేసుల దడ పుట్టిస్తున్నది. మరో వైపు కేసీఆర్ కూతురైన కవిత ఎపిసోడ్ ఆందోళనకు గురిచేస్తున్నది. దీంతో ఆ పార్టీలో అయోమయం నెలకొన్నది.
KCR: కాళేశ్వరంపై రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిషన్‌ను వేయడం, నివేదిక ఇవ్వడం, సీబీఐకి కేసును అప్పగించడం జరిగిపోయాయి. ఈ నేపథ్యంలో కేసీఆర్, హరీశ్‌పై సీబీఐ కేసు నమోదవుతుందని, దానిని ఎదుర్కోవడం చాలా కష్టతరమని ఆ పార్టీ ఒక గుబులు ఉన్నది. అదే విధంగా ఫార్ములా ఈ కార్ రేస్‌పై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ను ఏసీబీ విచారణల పేరిట పిలుస్తుండటంతో ఆ పార్టీ చికాకు పుడుతుంది.
KCR: ఈ దశలోనే స్థానిక ఎన్నికల జరుగుతాయని ప్రచారం జరుగుతున్నది. ఈ ఎన్నికల సమయంలోనైనా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రజల్లోకి వస్తారని భావించారు. కానీ, అది కూడా డౌటేనని తేలిపోయింది. కాకుంటే వీటన్నింటిపై కేసీఆర్ ఎప్పటికప్పుడు సమాలోచనలు జరుపుతూ పార్టీ కీలక నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారనేది వాస్తవం. కేటీఆర్, హరీశ్, ఇతర ముఖ్య నేతలను కార్యోన్ముఖులను చేస్తూ వస్తున్నారు. అదే విధంగా జిల్లాల వారీగా కూడా కేసీఆర్ సమీక్షలు జరిపారు.
KCR: కేసీఆర్‌కు ఆరోగ్య సమస్యలు కూడా ప్రతిబంధకంగా మారాయి. ఎన్నికల అనంతరం ఆయన రెండు సార్లు ఆసుపత్రిలో చేరి వైద్య చికిత్సలు పొందారు. ఇప్పటికీ అనారోగ్య సమస్యలతో సతమతం అవుతున్నారు. జనంలోకి వెళ్లకపోవడానికి ఇది కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు. తాను ఎంతగానో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి, సంక్షేమంలో అన్ని రాష్ట్రాలకన్నా మిన్నగా చేస్తే తనను ఓడించి ఇంట్లో కూర్చొబెట్టారనే బాధతో కూడా ఆయన ఇప్పట్లో జనంలోకి వెళ్లేందుకు సుముఖంగా లేరని విశ్లేషకులు చెప్తున్నారు.
KCR: ఇదే సమయంలో పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేల అంశం తెరపైకి వచ్చింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఆయా స్థానాల్లో ఉప ఎన్నికలు ఖాయమని భావిస్తున్నారు. ఈ ఎన్నికల సమయంలోనైనా కేసీఆర్ రావాల్సిందేనని ఆ పార్టీ శ్రేణులు బలంగా కోరుకుంటున్నాయి. ఇప్పటి వరకు అయితే కేసీఆర్ నుంచి స్పష్టమైన సంకేతాలు రాలేదు కానీ, ఇదే ఎన్నికల నాటికి ఆయన బయటకు వచ్చే అవకాశం తప్పక ఉంటుందని రాజకీయ విశ్లేషకులు స్పష్టంగా చెప్తున్నారు. చివరికి కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూద్దాం.