MLC Kavitha: బిఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అమెరికా పర్యటన ముగించుకొని స్వదేశానికి చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఆమెకు తెలంగాణ జాగృతి కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఆమె రాగానే “సీఎం సీఎం” అనే నినాదాలతో విమానాశ్రయం మారుమోగింది. అయితే ఈ పునరాగమనం రాజకీయంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ఆమె రెండు వారాల క్రితం బిఆర్‌ఎస్ అధినేత, తన తండ్రి కేసీఆర్‌కు రాసిన లేఖ బహిర్గతం కావడమే ఇందుకు కారణం.
లేఖ రాసింది నేనే… కానీ బయటికి ఎలా వచ్చిందో అర్థం కావడం లేదు
మీడియాతో మాట్లాడిన కవిత, “వరంగల్ సభ అనంతరం నా ఆంతర్యం తెలియజేస్తూ కేసీఆర్ గారికి లేఖ రాశాను. పార్టీలోని లోపాలను చూపించడమే నా ఉద్దేశం. కానీ ఆ లేఖ లీక్ అవ్వడం బాధాకరం” అని ఆమె అన్నారు. “నా లేఖలో ఏమీ పర్సనల్ అజెండా లేదు. ప్రజలు, నాయకులు అనుకుంటున్న సంగతులే రాశాను. కేసీఆర్ దేవుడు లాంటివారు.. కానీ ఆయన చుట్టూ దెయ్యాలు చేరిపోయాయి. ఆ కోవర్టులే పార్టీకి నష్టం చేస్తున్నారు” అని వ్యాఖ్యానించారు.
లేఖ లీక్ వెనక కుట్ర?
కవిత వ్యాఖ్యలు చూస్తే లేఖ లీక్ వెనుక పార్టీ అంతర్గత కుట్రలే ఉండే అవకాశముంది. “నాకు ఇది ఎదురైతే, మిగిలిన నాయకుల పరిస్థితి ఏంటి?” అని ఆమె ప్రశ్నించారు. ఇటువంటి పరిణామాలపై పార్టీలో ఆత్మపరిశీలన అవసరమని, పార్టీ భవిష్యత్తు కోసం కోవర్టులను పక్కకు తప్పించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: POLYCET Results 2025: నేడు పాలిసెట్-2025 ఫలితాలు
స్వాగత వేడుకలు… కానీ బిఆర్‌ఎస్ జెండాలు కనిపించలేదే?
కవిత రాక సందర్భంగా పెద్ద ఎత్తున అభిమానుల తరలివస్తూ స్వాగతం పలికినప్పటికీ, బిఆర్‌ఎస్ అధికారిక జెండాలు ఎక్కడా కనిపించకపోవడం గమనార్హం. పార్టీకి చెందిన నేతలు ఎవరూ ఎయిర్‌పోర్టుకు రాకపోవడం ఆసక్తికరంగా మారింది. దీనిపై పార్టీలోపల చర్చ సాగుతోంది. పైగా బ్యానర్లలో గులాబీ రంగుకు బదులుగా నీలి బ్యాక్‌గ్రౌండ్‌లో పసుపు అక్షరాలు కనిపించడం, పార్టీ వర్గాల్లో సందేహాలకు తావిస్తోంది.
పార్టీ పునర్‌మూల్యాంకనం అవసరం
కవిత మాట్లాడుతూ, “పార్టీలో చిన్న చిన్న లోపాలను బయటపెట్టి చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. పార్టీ బలపడాలంటే కోవర్టులను తొలగించాలి” అని తెలిపారు. కాంగ్రెస్, బిజెపి లాంటి ప్రత్యర్థులు ఈ లేఖ లీక్‌ను తమకు అనుకూలంగా మలుచుకోవడానికి ప్రయత్నిస్తున్నారనీ, కానీ నిజమైన నాయకత్వం కేసీఆర్‌దే అని, రాష్ట్ర భవిష్యత్తు కూడా ఆయన పైనే ఆధారపడి ఉందని ఆమె స్పష్టం చేశారు.

