KCR

KCR: న్యాయవాదులతో కేసీఆర్ మంతనాలు.. తదుపరి అడుగు ఎటువైపు?

KCR: ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ ఇచ్చిన నోటీసులతో తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఈ నోటీసులపై ఎలా ముందుకు వెళ్లాలనే అంశంపై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తన వ్యవసాయ క్షేత్రమైన ఎర్రవల్లిలో ముమ్మరంగా చర్చిస్తున్నారు. నిన్నటి నుంచి కేటీఆర్, హరీష్ రావులతో పాటు పార్టీకి చెందిన ముఖ్య నేతలు, సీనియర్ న్యాయవాదులు అక్కడే ఉండి తదుపరి వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు. రేపు జరగబోయే విచారణలో ఎలాంటి ప్రశ్నలు ఎదురవుతాయి, వాటికి చట్టపరంగా ఎలా సమాధానం చెప్పాలనే దానిపై కసరత్తు జరుగుతోంది.

నిజానికి తనను ఎర్రవల్లిలోని ఇంటి వద్దే విచారించాలని కేసీఆర్ పోలీసులను కోరారు. కానీ, అందుకు సిట్ అధికారులు అంగీకరించలేదు. తాము ఎర్రవల్లికి రాలేమని, హైదరాబాద్‌లోనే విచారణ జరుపుతామని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో, ఫిబ్రవరి 1వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్‌లోని నందినగర్ నివాసంలో కేసీఆర్ అందుబాటులో ఉండాలని పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు. దీంతో రేపు మధ్యాహ్నం నందినగర్‌లో సిట్ అధికారుల విచారణ జరగడం ఖాయంగా కనిపిస్తోంది.

ఈ పరిణామాల మధ్య కేసీఆర్ తన న్యాయవాదుల బృందంతో సుదీర్ఘంగా ఆలోచనలు చేస్తున్నారు. గతంలో పోలీసులు ఇచ్చిన నోటీసులు, దానికి కేసీఆర్ ఇచ్చిన సమాధానాలు, అలాగే చట్టంలోని నిబంధనలను బేరీజు వేసుకుంటున్నారు. ఒకపక్క రాజకీయంగా ప్రభుత్వంపై పోరాడుతూనే, మరోపక్క న్యాయపరంగా ఈ కేసును ఎలా ఎదుర్కోవాలో బీఆర్ఎస్ అగ్ర నాయకత్వం ప్రణాళికలు రచిస్తోంది. రేపటి విచారణ తర్వాత ఈ కేసు ఎలాంటి మలుపు తిరుగుతుందో అని రాష్ట్రమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *