KCR: రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరయ్యారు. బుధవారం (మార్చి 12న) ఉదయం ప్రారంభమైన సమావేశాలకు తోటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి ఆయన అసెంబ్లీకి వచ్చారు. తొలుత హైదరాబాద్ నందినగర్ నివాసం నుంచి ఆయన బయలుదేరి నేరుగా అసెంబ్లీ వద్దకు వచ్చారు.
KCR: తెలంగాణకు తొలి ముఖ్యమంత్రిగా రెండు టర్మ్‌లు పనిచేసిన కేసీఆర్.. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి పాలైన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఒకసారి మినహా ఇంతవరకూ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాలేదు. ప్రమాణ స్వీకారం కోసం వచ్చిన ఆయన మళ్లీ రాలేదు. మళ్లీ అసెంబ్లీకి రావడం ఇదే కావడం గమనార్హం.
KCR: కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడంపై తరచూ సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం అభ్యంతరాలు వ్యక్తంచేస్తూ వస్తున్నారు. కేసీఆర్ ప్రతిపక్ష పాత్ర పోషించడం లేదంటూ వ్యంగబాణాలు విసురుతూ వస్తున్నారు. వచ్చి సూచనలు, సలహాలు ఇవ్వాలంటూ కోరుకుంటూనే, భయపడుతున్నారని అంటూ ఇతర విసుర్లు విసురుతున్నారు.
KCR: ఇటీవల ఏకంగా కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడంపై ఓ వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మరో కాంగ్రెస్ నేత ఏకంగా అసెంబ్లీ అధికారికే లేఖ రాశారు. ఆయనకు ప్రతిపక్ష నేత, ఎమ్మెల్యే రెమ్యునరేషన్ ఇవ్వొద్దంటూ తన వినతిపత్రంలో కోరారు. ఈ దశలో ఈసారి ఆయన హాజరు కాకపోతే పదవీ గండం కూడా ఉన్నదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ దశలో కేసీఆర్ అసెంబ్లీకి రావడం జరిగింది. తొలుత బీఆర్ఎస్ శాసనసభా పక్షం కార్యాలయంలో కేసీఆర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేలతో తొలుత సమావేశమై ఆ తర్వాత అసెంబ్లీ హాలులోనికి మిగతా సభ్యులతో కలిసి వెళ్లారు.
KCR: గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగంతో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయ సభల సభ్యులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. కాంగ్రెస్ సర్కార్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వల్లెవేస్తున్నారు. గవర్నర్ ప్రసంగాన్ని కేసీఆర్ గంభీరంగా వింటుండగా, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. గవర్నర్ ప్రసంగలోని అంశాలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తంచేస్తున్నారు. అయినా గవర్నర్ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు.