Kcr: ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు జారీ చేసిన నోటీసులపై బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించారు. ఈ మేరకు ఆయన సిట్ అధికారులకు లేఖ రాశారు. మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతున్నందున రేపటి విచారణకు హాజరు కావడం సాధ్యం కాదని తెలిపారు. తనకు కొంత సమయం ఇవ్వాలని కోరుతూ, ఎర్రవెల్లిలోని తన ఫామ్‌హౌజ్‌లోనే విచారణ జరపవచ్చని సూచించారు. రేపటి విచారణను వాయిదా వేసి, మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ పూర్తైన తర్వాత విచారణ చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. బాధ్యతగల పౌరుడిగా విచారణకు సహకరిస్తానని కూడా కేసీఆర్ పేర్కొన్నారు.
ఇదే తరహాలో గతంలో కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై ఏర్పాటు చేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ విషయంలోనూ కేసీఆర్ సమయం కోరిన విషయం గుర్తుండదగినది. 2025 జూన్‌లో కమిషన్ నోటీసులు ఇచ్చినప్పుడు, కొన్ని పనుల కారణంగా జూన్ 11 వరకూ గడువు ఇవ్వాలని కోరగా కమిషన్ అంగీకరించింది. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసులో కూడా సిట్ అధికారులు కేసీఆర్‌కు గడువు ఇస్తారా? లేక రేపే విచారణ జరుపుతారా? అన్నది రాజకీయ వర్గాల్లో ఉత్కంఠగా మారింది.
