Kavitha

Kavitha: తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త మలుపు.. ఏప్రిల్ 25న కవిత కొత్త పార్టీ ప్రకటన!

Kavitha: తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తన సొంత రాజకీయ పార్టీని స్థాపించబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు ముహూర్తాన్ని కూడా ఖరారు చేశారు. ఏప్రిల్ 25వ తేదీన ఉదయం 10 గంటలకు కొత్త పార్టీకి సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించనున్నారు. మేడ్చల్ జిల్లా మునీరాబాద్‌లోని ‘అధ్వయ కన్వెన్షన్’లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి, అక్కడే పార్టీ పేరును మరియు జెండాను ప్రజల ముందుకు తీసుకురానున్నట్లు ఆమె తెలిపారు.

శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా ఈ నిర్ణయాన్ని ప్రకటించడం విశేషం. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. తన పార్టీలో యువతకు, మహిళలకు పెద్దపీట వేస్తామని స్పష్టం చేశారు. ఇప్పటివరకు పురుషులు స్థాపించిన పార్టీల పాలనను ప్రజలు చూశారని, ఇప్పుడు తెలంగాణ ఆడబిడ్డగా తాను స్థాపించబోయే పార్టీతో రాజకీయాల్లో కొత్త మార్పు వస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.

తెలంగాణ ప్రయోజనాలే లక్ష్యంగా, మహిళా శక్తిని చాటిచెప్పేలా ఈ పార్టీ ఉండబోతోందని ఆమె సంకేతాలిచ్చారు. ఏప్రిల్ 25న జరగబోయే ఈ సభ కోసం ఇప్పటికే ఏర్పాట్లు మొదలయ్యాయి. కవిత తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అటు రాజకీయ వర్గాల్లోనూ, ఇటు సామాన్య ప్రజల్లోనూ ఈ కొత్త పార్టీ పేరు ఏమై ఉంటుందనే ఉత్కంఠ నెలకొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *