Kavitha

Kavitha: ఆడబిడ్డల ఉసురు తగులుతుంది.. రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ఎమ్మెల్సీ కవిత ఫైర్.

Kavitha: ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో ఇళ్ల కూల్చివేతకు గురైన పేద కుటుంబాలను కల్వకుంట్ల కవిత సోమవారం పరామర్శించారు. నిలువ నీడ లేక రోడ్డున పడ్డ బాధితుల కష్టాలను చూసి ఆమె చలించిపోయారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆమె తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వందలాది మంది ఆడబిడ్డలను ఏడిపిస్తున్న ఈ ప్రభుత్వానికి వారి శాపనార్థాలు తప్పవని, ఆడబిడ్డల కన్నీరు ఇంటికి, రాష్ట్రానికి మంచిది కాదని ఆమె హెచ్చరించారు.

పిల్లలకు పరీక్షలు జరుగుతున్న సమయంలో, కనీసం ముందస్తు సమాచారం లేకుండా రాత్రికి రాత్రే బుల్డోజర్లతో ఇళ్లను కూల్చివేయడం అత్యంత అమానుషమని కవిత మండిపడ్డారు. పుస్తకాలు, సామాన్లు కూడా సర్దుకునే అవకాశం ఇవ్వకుండా ఇళ్లను నేలమట్టం చేయడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో కొందరు రాజకీయ నాయకులు ఇక్కడికి వచ్చి ఏదో ప్రదర్శన చూసినట్లు చూసి వెళ్లారని, తాను మాత్రం అలా కాకుండా బాధితులకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ జేఏసీలతో పాటు జాగృతి సంస్థ బాధితుల పక్షాన నిలబడుతుందని స్పష్టం చేశారు.

జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నప్పటికీ, వెలుగుమట్ల బాధితుల సమస్యను పట్టించుకోకపోవడం దారుణమని కవిత విమర్శించారు. ఇళ్లు కోల్పోయిన మహిళలను కనీస సౌకర్యాలు లేని చోట ఉంచారని, కనీసం వైద్య శిబిరాలు కూడా ఏర్పాటు చేయలేదని ఆరోపించారు. జిల్లా కలెక్టర్ కూడా ఇంతవరకు బాధితులను సందర్శించకపోవడం బాధ్యతారాహిత్యమని ఆమె అన్నారు. సామాన్యుల ఇళ్లను కూల్చే ప్రభుత్వం, పెద్దల భవనాల జోలికి ఎందుకు వెళ్లడం లేదని ఆమె ప్రశ్నించారు.

వెలుగుమట్ల బాధితులకు ఎక్కడైతే ఇళ్లు కూల్చారో, అదే స్థలంలో తిరిగి ఇళ్లు కట్టించి ఇవ్వాలని కవిత డిమాండ్ చేశారు. వేరే ప్రాంతానికి వెళ్లాలని ప్రభుత్వం ఒత్తిడి చేస్తే ఒప్పుకోవద్దని, హక్కుల కోసం పోరాడాలని ఆమె పిలుపునిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా పేదల ఇళ్లపై బుల్డోజర్లు పంపుతున్న తీరును ప్రజలందరూ గమనిస్తున్నారని, ప్రభుత్వం తక్షణమే స్పందించి బాధితులకు న్యాయం చేయాలని ఆమె డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *