Kalvakuntla Kavitha: తెలంగాణ రాజకీయాలు మరో కీలక మలుపు తిరుగుతున్నాయి. బీఆర్‌ఎస్ పార్టీ నుంచి దూరమైన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన భవిష్యత్తు కార్యాచరణను స్పష్టం చేశారు. బుధవారం రోజున ఆమె ‘జాగృతి జనం బాట’ పేరిట చేపట్టబోయే సుదీర్ఘ యాత్ర పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా కవిత చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారాయి.
‘ఆ చెట్టు నీడ నాది కాదు, నా దారి నేను చూసుకుంటున్నా’
అక్టోబర్ 25, 2025 నుంచి ఫిబ్రవరి 13, 2026 వరకు నాలుగు నెలల పాటు తెలంగాణ వ్యాప్తంగా ఈ యాత్ర కొనసాగనుంది. ఈ పర్యటన గురించి కవిత చేసిన ప్రకటనలు, ముఖ్యంగా ఆమె తండ్రి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ గురించి చేసిన వ్యాఖ్యలు ఆమె స్వతంత్ర రాజకీయ ప్రయాణానికి సంకేతంగా కనిపిస్తున్నాయి.
కవిత కీలక వ్యాఖ్యలు:
- కేసీఆర్ ఫొటో లేకుండానే యాత్ర: “జాగృతి జనం బాట” యాత్రలో కేసీఆర్ ఫొటో ఉండబోదు. కేసీఆర్ ఒక పార్టీకి (బీఆర్‌ఎస్) అధ్యక్షులుగా ఉన్నారు. అలాంటప్పుడు ఆయన ఫొటోతో ప్రజల్లోకి వెళ్లడం సరికాదు.
- పార్టీ నుంచి సస్పెన్షన్: “కేసీఆర్ పార్టీ నుంచి నన్ను సస్పెండ్ చేశారు. ఆ చెట్టు నీడ నాది కాదు” అంటూ బీఆర్‌ఎస్‌తో ఉన్న ప్రస్తుత బంధాన్ని కవిత కుండబద్దలు కొట్టారు.
- స్వతంత్రత: “నేను నా దారి నేను చూసుకుంటున్నా. జాగృతి మొదటి నుంచీ స్వతంత్రంగా పనిచేసింది. కేసీఆర్ నుంచి ఒక్క ఆలోచన కూడా తీసుకోలేదు.”
- కేసీఆర్‌పై గౌరవం: ఇది కేసీఆర్‌ను అగౌరవపరిచే ఉద్దేశం కాదని కవిత స్పష్టం చేశారు. “కేసీఆర్ లేకుండా తెలంగాణ ఉద్యమం లేదు, తెలంగాణ లేదు” అని గౌరవాన్ని ప్రకటించారు.
- సామాజిక తెలంగాణ లక్ష్యం: ఉద్యమకారులు, అమరవీరుల త్యాగాలకు అర్థం ఉండాలంటే సామాజిక తెలంగాణ రావాలని, అందుకే ఈ యాత్ర చేస్తున్నామని కవిత వివరించారు.
ఇది కూడా చదవండి: Gold Price Today: తెలుగు రాష్ట్రాల్లో మండుతున్న బంగారం ధరలు.. తులం ఎంతంటే?
వైరుధ్యంపై వివరణ
ఇదిలా ఉండగా, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తూ, బీఆర్‌ఎస్ నుంచి వైదొలగుతున్నట్లు ప్రకటించే సమయంలో కవిత… కేసీఆర్ ఫొటోతోనే భవిష్యత్ కార్యక్రమాలు చేపడతామని ప్రకటించిన సంగతిని గుర్తుచేసుకోవాలి.
అయితే, ఇప్పుడు “ఆ చెట్టు కింద దుర్మార్గులు ఉన్నారు” అంటూ బీఆర్‌ఎస్ నాయకత్వాన్ని ఉద్దేశించి చేసిన పరోక్ష విమర్శ, కేసీఆర్ ఫొటో లేకుండానే యాత్ర చేయాలని తీసుకున్న నిర్ణయం… కవిత ఇకపై బీఆర్‌ఎస్ లేదా దాని అనుబంధ సంస్థల నీడ లేకుండా, పూర్తి స్వతంత్రంగా ప్రజల్లోకి వెళ్లడానికి సిద్ధమయ్యారని స్పష్టమవుతోంది.
రాబోయే నాలుగు నెలల పాటు జరగనున్న ఈ జాగృతి జనం బాట యాత్ర తెలంగాణ రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో, కవిత కొత్త రాజకీయ శక్తిగా ఎదుగుతారో లేదో కాలమే నిర్ణయించాలి.