Kavitha: తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసుపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత స్పందించారు. ఈ కేసు విచారణ మొదలై రెండేళ్లు గడుస్తున్నా ఇంకా ఒక కొలిక్కి రాకపోవడంపై ఆమె అసహనం వ్యక్తం చేశారు. దోషులు ఎవరైనా సరే వారికి కఠిన శిక్ష పడాలని, ఈ విచారణ ప్రక్రియ వేగంగా ముగియాలని ఆమె కోరారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె ఈ విషయాలను వెల్లడించారు.
చట్టం ముందు అందరూ సమానులేనని, దర్యాప్తు సంస్థలకు అందరూ సహకరించాలని కవిత సూచించారు. సిట్ (SIT) విచారణను తప్పుపడుతూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలతో ఆమె ఏకీభవించలేదు. చట్టాలను గౌరవించడం అందరి బాధ్యత అని గుర్తు చేశారు. అలాగే, గతంలో ఏం జరిగిందనే విషయంపై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించి పూర్తి వివరాలు చెబుతారని తాను భావిస్తున్నట్లు కవిత పేర్కొన్నారు.
తన వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడుతూ.. తన ఫోన్‌తో పాటు తన భర్త ఫోన్ కూడా ట్యాపింగ్‌కు గురైందనే అనుమానం ఉందని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసులో సిట్ అధికారులు తనను విచారణకు పిలిస్తే ఖచ్చితంగా వెళ్తానని, పూర్తిస్థాయిలో సహకరిస్తానని ఆమె స్పష్టం చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ పార్టీ నాటకాలు ఆడుతోందని ఆమె ఈ సందర్భంగా విమర్శించారు.
