kavitha

kavitha: నాపై కక్ష కట్టారు.. శాసనమండలిలో కవిత కంటతడి!

kavitha: తెలంగాణ రాజకీయాల్లో ఊహించని మలుపు చోటుచేసుకుంది. బీఆర్ఎస్ అగ్రనేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తూ శాసనమండలిలో చేసిన ప్రసంగం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇది తన చివరి ప్రసంగమని చెబుతూ, నిండు సభలో ఆమె కంటతడి పెట్టుకోవడం సభను విస్మయానికి గురిచేసింది. తన రాజీనామాను తక్షణమే ఆమోదించాలని మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని కోరుతూనే, గత కొంతకాలంగా బీఆర్ఎస్ పార్టీలో తాను ఎదుర్కొన్న అంతర్గత వేదనను ఆమె బయటపెట్టారు.

తన రాజకీయ ప్రస్థానాన్ని గుర్తు చేసుకున్న కవిత, బీఆర్ఎస్‌లో చేరకముందే తాను ‘జాగృతి’ని స్థాపించి ఎనిమిదేళ్ల పాటు స్వతంత్రంగా పనిచేశానని గుర్తుచేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు పోరాడానని, అప్పట్లో పార్టీలకు అతీతంగా పనిచేశానని పేర్కొన్నారు. అయితే, పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కొన్ని శక్తులు తనపై కక్షగట్టాయని, కనీసం అంతర్గత స్వాతంత్ర్యం లేని పరిస్థితుల్లో పనిచేయాల్సి వచ్చిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీకి అనుకూలంగా ఉండే మీడియా సంస్థలు కూడా తనకు ఏనాడూ మద్దతు ఇవ్వలేదని, చివరికి తాను కష్టకాలంలో జైలులో ఉన్నప్పుడు కూడా సొంత పార్టీ అండగా నిలబడలేదని ఆమె బాంబు పేల్చారు.

కేసీఆర్ కుటుంబంలో విభేదాలు ఉన్నాయన్న ప్రచారాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ, ఇది కేవలం ఆస్తుల పంచాయతీ కాదని, తన ఆత్మగౌరవ పోరాటమని కవిత స్పష్టం చేశారు. తన ఇద్దరు బిడ్డల మీద ప్రమాణం చేసి చెబుతున్నానని, బీఆర్ఎస్ పాలనలో అంబేద్కర్ విగ్రహం నుంచి అమరజ్యోతి నిర్మాణం వరకు అవినీతి జరిగిందని సంచలన ఆరోపణలు చేశారు. నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో పార్టీ ప్రజలకు అన్యాయం చేసిందని పేర్కొన్నారు. పార్టీ వైఫల్యాలను ప్రశ్నించినందుకు తనను 24 గంటల్లోనే సస్పెండ్ చేశారని, కేటీఆర్ లేదా హరీష్ రావులపై విమర్శలు వస్తే స్పందించే నాయకత్వం, కేసీఆర్‌పై విమర్శలు వస్తే మాత్రం మౌనంగా ఉంటోందని విమర్శించారు.

“వ్యక్తిగా ఈ సభ నుంచి వెళ్ళిపోతున్నాను.. కానీ భవిష్యత్తులో ఒక శక్తిగా తిరిగి వస్తాను” అని కవిత శపథం చేశారు. రాజకీయాల్లోకి వస్తానని తాను ఎప్పుడూ అనుకోలేదని, పదవుల కోసం ఎవరినీ ప్రాధేయపడలేదని చెబుతూ తన ప్రసంగాన్ని ముగించారు. కవిత చేసిన ఈ ఆరోపణలు మరియు బీఆర్ఎస్‌తో తెగతెంపులు చేసుకోవడం తెలంగాణ రాజకీయ ముఖచిత్రాన్ని ఏ విధంగా మార్చబోతుందోనన్న ఉత్కంఠ ఇప్పుడు అందరిలోనూ నెలకొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *