Kavita: బీఆర్ఎస్‌లో మాజీ ఎంపీ కవిత చేసిన ఆరోపణలు పార్టీ అంతర్గతంగా చర్చనీయాంశమయ్యాయి. హరీశ్ రావును పదేపదే టార్గెట్ చేస్తూ ఆమె చేస్తున్న వ్యాఖ్యలు రాజకీయంగా పెను సంచలనానికి దారి తీస్తున్నాయి. ఇటీవల ఆమె చేసిన ఆరోపణలకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రత్యుత్తరం ఇవ్వగా, తాజా పర్యటనలో కవిత మరోసారి స్పందించారు.
ఖమ్మం జిల్లాలో జాగృతి ‘జనం బాట’ కార్యక్రమంలో పాల్గొన్న కవిత మాట్లాడుతూ, హరీశ్ రావుపై వచ్చిన ఆరోపణలకు ఆయనే స్పందించాలి కానీ ప్రతి సారి ఇతరులు ముందుకు వచ్చి మాట్లాడటం ప్రజాస్వామ్య పద్ధతి కాదన్నారు.
“అరోపణలు వచ్చిన వ్యక్తి సమాధానం చెప్పాలి. పిల్లి మీద పిట్ట మీద పెట్టి వాళ్లతో వీళ్లతో తిట్టిస్తే ప్రజలు చూస్తున్నారు” అని వ్యాఖ్యానించారు. రేపు నిర్వహించే మీడియా సమావేశంలో ఈ వ్యవహారంపై పూర్తి వివరాలు వెల్లడిస్తానని తెలిపారు.
జూబ్లీహిల్స్ ఫలితంపై కవిత స్పంద
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించిన విషయంపై కూడా కవిత స్పందించారు. సాధారణంగా ఉప ఎన్నికల్లో అధికార పార్టీకి ప్రయోజనం ఉంటుందని, కొన్ని సందర్భాల్లో ప్రతిపక్షాలు గెలవడం జరిగే వ్యవహారమేనని ఆమె అన్నారు.
అయితే గ్రామాల్లో కాంగ్రెస్‌పై భారీ అసంతృప్తి ఉందని, ప్రజలు ఆ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడం పట్ల ఆగ్రహంగా ఉన్నారని విమర్శించారు.
ఆరు గ్యారంటీలలో ఒక్కటి కూడా అమలులో లేకపోయినా కాంగ్రెస్ గెలవడం, ప్రధాన ప్రతిపక్షాలైన బీజేపీ, బీఆర్ఎస్ వైఫల్యాన్ని స్పష్టంగా చూపిస్తున్నదని ఆమె దుయ్యబట్టారు.
ప్రజల సమస్యలపై సరైన స్థాయిలో పోరాటం చేయకపోవడం వల్ల ప్రత్యామ్నాయ శక్తిగా ‘తెలంగాణ జాగృతి’ ముందుకు రావాల్సిన పరిస్థితి ఏర్పడిందని కవిత తెలిపింది.

