Kavita: యూరియా కొరతపై రైతులు ప్రశ్నిస్తే వేధింపులకు గురి చేయడం కాంగ్రెస్ ప్రభుత్వానికి సాధారణమైందా అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలానికి చెందిన రైతు లక్ష్మణ్ యాదవ్ యూరియా కొరతపై నిలదీయగా, ఆయన ఇంటికి పోలీసులు వెళ్లిన ఘటనపై కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎక్స్ వేదికగా స్పందించిన ఆమె, “యూరియా కొరతపై ప్రశ్నించడమే నేరమా? ఇందిరమ్మ రాజ్యమంటే వేధింపులు, బెదిరింపులా? రైతు ప్రశ్నిస్తే అతడిని ఇబ్బందిపెట్టడం దుర్మార్గం” అని మండిపడ్డారు.
ఈ సందర్భంగా కవిత ఒక వీడియోను షేర్ చేస్తూ, “కాంగ్రెస్ నాయకుడు ఫిర్యాదు చేయగానే పోలీసులు చట్టవ్యతిరేక చర్యలకు దిగుతున్నారు. రైతులను భయపెట్టే ప్రయత్నాలు ఎట్టి పరిస్థితుల్లోనూ సహించం” అని స్పష్టం చేశారు.
“పెడితే మూల్యం చెల్లించుకోక తప్పదు” అని హెచ్చరించిన కవిత, రైతుల గళాన్ని అణగదొక్కే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వానికి చేదు అనుభవాలు మిగులుస్తుందని హెచ్చరించారు.