Kavita: 2029 ఎన్నికల్లో తప్పకుండా పోటీ చేస్తాం

Kavita : జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన రాజకీయ భవిష్యత్తుపై కీలక ప్రకటన చేశారు. 2029లో జరిగే ఎన్నికల్లో తాను తప్పకుండా పోటీ చేయనున్నట్లు స్పష్టం చేశారు. సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో ‘ఆస్క్ కవిత’ పేరుతో నిర్వహించిన క్వశ్చన్ అవర్‌లో నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు ఆమె ఓపికగా సమాధానాలు ఇచ్చారు.

ఈ సందర్భంగా జాగృతి సంస్థను రాజకీయ పార్టీగా మార్చే దిశగా ఆమె సంకేతాలు ఇచ్చారు. త్వరలోనే జాగృతి కార్యకలాపాలను గ్రామస్థాయి వరకు విస్తరిస్తామని, ప్రతి గ్రామంలో జాగృతి కమిటీలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. జాగృతి సంస్థ ద్వారానే ఎన్నికల బరిలోకి దిగనున్నట్లు ఆమె వ్యాఖ్యలు పరోక్షంగా స్పష్టం చేస్తున్నాయని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

కొత్త పార్టీ పేరు ఏమిటని ఓ నెటిజన్ ప్రశ్నించగా, “ఎలా ఉండాలో మీరే చెప్పండి” అంటూ కవిత ఆసక్తికరంగా స్పందించారు. ఈ సమాధానం రాజకీయంగా ఆసక్తిని రేకెత్తించింది. కొత్త పార్టీపై చర్చకు ఇది దారితీసిందని విశ్లేషకులు భావిస్తున్నారు.

2047 నాటికి దేశ ప్రజలందరికీ నాణ్యమైన ఉచిత విద్య, ఉచిత వైద్యం అందించడమే తన జీవిత లక్ష్యమని కవిత మరోసారి పునరుద్ఘాటించారు. ఇదే తన విజన్, మిషన్ అని ఆమె పేర్కొన్నారు. కవిత తాజా ప్రకటనతో ఆమె భవిష్యత్ రాజకీయ ప్రణాళికలపై విస్తృత చర్చ ప్రారంభమైంది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *