Adilabad: ఆదిలాబాద్ జిల్లా, నార్నూర్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలో విద్యార్థినులు ఆందోళనకు దిగారు. తమకు అందిస్తున్న భోజనంలో నాణ్యత లోపించిందని, అన్నంలో పురుగులు వస్తున్నాయని విద్యార్థులు ఆరోపించారు.
గత కొన్ని రోజులుగా భోజనం నాణ్యతపై సమస్యలు ఎదురవుతున్నాయని, ఎన్నిసార్లు అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం కూడా ఇదే పరిస్థితి పునరావృతం కావడంతో, విసుగు చెందిన విద్యార్థులు భోజనం ప్లేట్లు పట్టుకుని పాఠశాల ఆవరణలో నిరసన తెలిపారు. తమకు నాణ్యమైన ఆహారం అందించాలని డిమాండ్ చేశారు.
విద్యార్థులు తమ ఆవేదనను తెలియజేస్తూ ప్లేట్లలో పురుగులతో ఉన్న భోజనాన్ని చూపించారు. ప్రభుత్వ నిధులతో నడిచే ఇలాంటి పాఠశాలలో విద్యార్థులకు సరిగా భోజనం అందించకపోవడంపై తల్లిదండ్రులు, స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి, నాణ్యమైన భోజనం అందేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.