Karur Stampede: తమిళనాడులోని కరూర్‌లో సెప్టెంబర్ 27న జరిగిన తొక్కిసలాట ఘటన మరోసారి వార్తల్లో నిలిచింది. ఆ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధ్యక్షుడు విజయ్ ఆర్థిక సాయం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, ఆ సహాయం అందుకున్న ఒక కుటుంబం తీసుకున్న నిర్ణయం ప్రస్తుతం చర్చనీయాంశమైంది.
మృతుల్లో ఒకరైన రమేశ్ భార్య సంఘవి, టీవీకే తరఫున జమ చేసిన రూ.20 లక్షల పరిహారాన్ని తిరిగి పంపించారు. ఆమె ఈ చర్యకు గల కారణాన్ని వివరించారు. “విజయ్ గారు నేరుగా మమ్మల్ని ఓదారుస్తారని ఆశించాం. వీడియో కాల్‌లో మాట్లాడి సాయం అందిస్తామని చెప్పారు. కానీ ఆర్థిక సహాయం కంటే ఆయన స్వయంగా వచ్చి పరామర్శిస్తే మాకు మరింత ఆత్మీయత కలిగించేది,” అని ఆమె పేర్కొన్నారు.
Also Read: President Murmu: ఆపరేషన్ సిందూర్‌లో ఉపయోగించిన యుద్ధ విమానంలో రాష్ట్రపతి గగన విహారం
సంఘవి తెలిపిన ప్రకారం, తమ పేరుతో బంధువులు ముగ్గురు విజయ్ ఆహ్వానించిన సమావేశానికి హాజరయ్యారని, కానీ తాము వెళ్లలేదని చెప్పారు. తమ అనుమతి లేకుండా డబ్బు జమ చేయడంతో ఆ మొత్తం తిరిగి పంపించామని ఆమె వెల్లడించారు. ఈ ఘటనపై సోషల్ మీడియాలో విస్తృత చర్చ జరుగుతోంది. కొందరు సంఘవి నిర్ణయాన్ని గౌరవిస్తుండగా, మరికొందరు ఆమె భావోద్వేగాన్ని అర్థం చేసుకుంటున్నారు. ఇక విజయ్ వ్యక్తిగతంగా బాధిత కుటుంబాలను కలుస్తారా అనే అంశంపై అభిమానులు, ప్రజల్లో ఆసక్తి నెలకొంది.

