Karthi: తమిళంలో స్టార్ హీరోగా, తెలుగులోనూ తన అన్న సూర్య మాదిరిగానే గొప్ప ఫాలోయింగ్‌ను సంపాదించుకున్న నటుడు కార్తీ త్వరలో తెలుగు దర్శకుడితో కలిసి ఒక కొత్త ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా, ‘మ్యాడ్’ సిరీస్‌తో యువ ప్రేక్షకులను ఆకట్టుకున్న దర్శకుడు కళ్యాణ్ శంకర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నట్టు తెలుస్తోంది.
ఈ ఆసక్తికర ప్రాజెక్ట్‌ను టాలీవుడ్‌లోని ప్రముఖ నిర్మాణ సంస్థలలో ఒకటైన సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మాత నాగవంశీ నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల సమాచారం. ఇప్పటికే సితార బ్యానర్ సూర్యతో ఒక సినిమాను (దర్శకుడు వెంకీ అట్లూరితో) సెట్ చేయగా, ఇప్పుడు ఆయన తమ్ముడు కార్తీతో మరో ప్రాజెక్ట్‌ను లైన్‌లో పెట్టడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
Also Read: Jailer 2: రజనీకాంత్ ‘జైలర్ 2’లో విజయ్ సేతుపతి?
కథలో కొత్తదనం ఉంటే తప్ప కార్తీ సినిమాలు ఒప్పుకోరని అభిమానుల నమ్మకం. కాబట్టి, కళ్యాణ్ శంకర్ కథకు కార్తీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారంటే, అందులో తప్పకుండా కొత్తదనం, ప్రత్యేకత ఉండి ఉంటుందని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కార్తీ నటించిన ‘వా వాతియార్’ (తెలుగులో ‘అన్నగారు వస్తారు’) సినిమా డిసెంబర్‌లో విడుదల కానుంది. అలాగే, అతని స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘సర్దార్ 2’ కూడా 2026లో థియేటర్లలో సందడి చేయనుంది. ఈ కొత్త కాంబినేషన్ (కార్తీ – కళ్యాణ్ శంకర్)పై త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులకు ఎలాంటి వినోదాన్ని అందిస్తుందో చూడాలి.

