Karregutta: తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని దండకారణ్యంలో కొనసాగుతున్న ‘ఆపరేషన్ కగార్’లో భద్రతా బలగాలు కీలక పురోగతిని సాధించాయి. కర్రెగుట్ట ప్రాంతంలో మావోయిస్టులకు చెందిన ఒక భారీ సొరంగాన్ని వారు గుర్తించారు. గత ఆరు రోజులుగా విస్తృతంగా కొనసాగుతున్న కూంబింగ్ ఆపరేషన్‌లో భాగంగా ఈ రహస్య స్థావరం వెలుగులోకి వచ్చింది.
అధికారుల అంచనా ప్రకారం, దాదాపు వెయ్యి మంది మావోయిస్టులు ఒకేసారి తలదాచుకోగలిగే విధంగా ఈ సొరంగాన్ని నిర్మించారు. కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న ఈ సొరంగంలో విశ్రాంతి తీసుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు, మైదాన ప్రాంతాలు, నీటి వసతి కూడా ఉన్నట్టు భద్రతా బలగాలు గుర్తించాయి. ఇవి చూస్తే, మావోయిస్టులు కొంత కాలంగా ఇక్కడే మకాం వేసి, తమ కార్యకలాపాలను నిర్వహించి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు.
కర్రెగుట్ట ప్రాంతం తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర రాష్ట్రాల సరిహద్దుల్లో వ్యూహాత్మకంగా ఉండటంతో మావోయిస్టులకు కీలక కేంద్రంగా నిలిచింది. అయితే భద్రతా బలగాల కదలికలను ముందుగానే పసిగట్టి, మావోయిస్టులు ఈ సొరంగాన్ని ఖాళీ చేసి వేరే ప్రాంతాలకు తరలిపోయినట్లు సమాచారం.
ప్రస్తుతం సుమారు 20,000 మంది భద్రతా సిబ్బంది ఆపరేషన్‌లో పాల్గొంటున్నారు. మావోయిస్టుల అగ్రనేత మడావి హిడ్మా సహా పలువురు కీలక నేతలు ఈ ప్రాంతంలోనే తలదాచుకున్నట్టు నిఘా వర్గాల సమాచారం ఉంది. దీంతో గాలింపు చర్యలను భద్రతా బలగాలు మరింత ముమ్మరం చేశాయి.
ప్రతికూల వాతావరణ పరిస్థితులు, ఎండ తీవ్రత, భారీ వర్షాలు వంటి సవాళ్లను ఎదుర్కొంటూ భద్రతా బలగాలు ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. ఇదివరకు పౌరహక్కుల సంఘాలు ఈ ఆపరేషన్‌ను తక్షణమే నిలిపి, చర్చల బాట పడాలని డిమాండ్ చేసినా, భద్రతా బలగాలు ముమ్మరంగా తన చర్యలను కొనసాగిస్తున్నాయి. ప్రస్తుతం కర్రెగుట్ట ప్రాంతం పూర్తిగా భద్రతా బలగాల ఆధీనంలోకి వచ్చిందని సమాచారం.