Karnataka: జేడీఎస్ నేత, భారత మాజీ ప్రధాని దేవేగౌడ మనవడు, మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ అత్యాచారం కేసులో దోషిగా తేలిపోయారు. బెంగళూరులోని ఒక ప్రత్యేక న్యాయస్థానం ఈ మేరకు తీర్పు వెలువరించింది. తీర్పు విన్న వెంటనే కోర్టు గదిలోనే ప్రజ్వల్ కంటతడి పెట్టారు. శిక్షపై నిర్ణయం రేపు (ఆగస్టు 2) ప్రకటించనున్నట్టు కోర్టు తెలిపింది.
దారుణం.. వీడియో తీసి బెదిరింపులు
గతేడాది ఒక మహిళ సైబర్ క్రైమ్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తనపై ప్రజ్వల్ రేవణ్ణ అత్యాచారానికి పాల్పడ్డాడని, దాన్ని వీడియో తీశి పలు మార్లు బెదిరించాడని ఆమె ఆరోపించారు. కేసు తీవ్రతను గమనించిన పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు.
చార్జీషీట్ లో 2,000 పేజీలు, 123 ఆధారాలు
విస్తృతంగా సాగిన దర్యాప్తులో సుమారు 2,000 పేజీల చార్జీషీట్ దాఖలైంది. విచారణలో భాగంగా 123 ఆధారాలు కోర్టుకు సమర్పించబడ్డాయి. ఫోరెన్సిక్ నివేదికలు, డిజిటల్ ఆధారాలు, బాధితురాలి వాంగ్మూలం కోర్టు పరిగణనలోకి తీసుకుంది.
2024 డిసెంబర్ 31న మొదలైన విచారణ
ఈ కేసుకు సంబంధించి విచారణ 2024 డిసెంబర్ 31న ప్రారంభమైంది. సుదీర్ఘ విచారణ అనంతరం, న్యాయస్థానం మంగళవారం నాడు (2025 జూలై 31) తుది తీర్పును వెలువరించింది. ప్రజ్వల్‌ను అత్యాచారానికి బాధ్యుడిగా ప్రకటించింది.
తుది శిక్షపై ఉత్కంఠ
కోర్టు రేపు శిక్షను ఖరారు చేయనుండగా, ప్రజ్వల్ రేవణ్ణ భవిష్యత్తు ఇప్పుడు న్యాయపరిధిలోనే ఆధారపడి ఉంది. రాజకీయంగా ఈ కేసు కర్ణాటకలో తీవ్ర ప్రభావం చూపే అవకాశముంది.
ఇక ప్రజ్వల్ రేవణ్ణకు ఎంతమేర శిక్ష పడుతుందనేది మొత్తం దేశం తిలకించబోతోంది.