Karnataka: ఇది మరో కోణం.. సభ్య సమాజానికో గుణపాఠం.. పరీక్షల్లో ఫెయిలై జీవితాలను అర్ధాంతరంగా కోల్పోవాలనుకుంటున్న వారికి కనువిప్పు.. తమ పిల్లల పట్ల తల్లిదండ్రుల బాధ్యతలను గుర్తెరిగేలా స్ఫూర్తినింపిన ఘటన. పరీక్షల్లో ఫెయిలైతే ఇలా ఉండాలి.. అనేలా, తలెత్తుకునేలా చేసిన వైనం.. టోటల్‌గా ఓటమి విజయానికి సోపానం.. అన్న సూక్తిని నిజం చేసేలా చేసిన శపథం.. పదో తరగతిలో ఫెయిలైన ఆ బాలుడి ఇంట్లో జరిగిన ఆ విశేషమేమిటో తెలుసుకుందాం రండి.
Karnataka: కర్ణాటక రాష్ట్రంలోని బాగల్‌కోట్‌లోని బసవేశ్వర్ అనే పేరుగల ఓ ఇంగ్లిష్ మీడియం స్కూల్‌లో అభిషేక్ చోళచగుడ్డ 2024-25 విద్యాసంవత్సరంలో పదో తరగతి చదివి పరీక్షలు రాశాడు. ఇటీవలే ఆ ఫలితాలు వచ్చాయి. ఆ ఫలితాల్లో అభిషేక్‌కు 600 మార్కులకు గాను 200 మార్కులు అంటే 32 శాతం వచ్చి ఆరు సబ్జెక్టులలోనూ ఫెయిలయ్యాడు.
Karnataka: అయితే అందరిలాగే అభిషేక్ కూడా బాధపడ్డాడు. తోటి విద్యార్థులు ఎందరో ఉత్తీర్ణులైతే తాను ఫెయిలయ్యానని కుంగిపోయాడు. ఇదే సమయంలో స్నేహితులంతా అభిషేక్ ను ఎగతాళి చేయసాగారు. ఆరు సబ్జెక్టుల్లో ఫెయిలయ్యాడంటూ సూటిపోటి మాటలతో కుళ్లు జోకులు వేసుకోసాగారు. వారి మాటలతో అభిషేక్ మనసు చివుక్కుమనిపించింది.
Karnataka: ఇదే సమయంలో అభిషేక్ పరిస్థితిని, తోటి విద్యార్థుల ఎగతాళి చేసే వైనాన్ని గమనించిన తల్లిదండ్రులు అందరిలాగా తిట్టిపోయలేదు. కొట్టనూలేదు. కొడుకు భవిష్యత్తు దెబ్బతింటుందని చింతించనూ లేదు. ఏదైతే అదవుతుందిలే బిడ్డా అంటూ అనునయించారు. సంయమనం పాటించారు. పల్లెత్తు మాట అనకుండా తన కొడుకును సాంత్వన చేసుకున్నారు. ధైర్యం నూరిపోశారు. మరోసారి పరీక్షలు రాస్తే పాస్ అవుతావులే అంటూ భరోసా కల్పించారు.
Karnataka: ఓడిపోయింది పరీక్షల్లో మాత్రమే.. జీవితంలో కాదు బిడ్డా.. అంటూ అభిషేక్ కు అతని తల్లిదండ్రులు కొండంత అండగా నిలిచారు. వెంటనే కేక్ కట్ చేసి సంబురంగా తన కొడుకుకు తినిపించారు. గుండెలకు హత్తుకొని జీవితం గురించి నూరిపోశారు. ఫెయిల్ అనేది ఓ చిన్న విషయం అని హితబోధ చేశారు. కొడుకు కూడా వారిచ్చిన ధైర్యంతో మనోధైర్యం తెచ్చుకున్నాడు.
Karnataka: ఓటమి విజయానికి సోపానం.. అన్న సూక్తిని అభిషేక్ గుర్తుచేసుకున్నాడు. నేను ఫెయిల్ అయినా నా కుటుంబం నన్ను ప్రోత్సహించింది. నేను మళ్లీ పరీక్ష రాసి పాస్, జీవితంలో విజయం సాధిస్తా.. అని అభిషేక్ తల్లిదండ్రులకు భరోసా, సభ్యసమాజానికి స్ఫూర్తిని ఇచ్చాడు. కాలర్ ఎగరేసుకుంటూ స్నేహితుల గాలిమాటలను లెక్కచేయకుండా తిరుగుతున్నాడు.
Karnataka: ఇప్పుడు చెప్పండి.. పదో తరగతిలో, ఇంటర్‌లో ఒకటి, రెండు పరీక్షల్లో ఫెయిలయ్యామని, తక్కువ మార్కులు వచ్చాయని ఇటీవల ఎందరో విద్యార్థులు తనువులు చాలించారు. ఆరు పరీక్షల్లో ఫెయిలైన అభిషేక్ మనోధైర్యంతో సంకల్ప సిద్ధిని పెట్టుకున్నాడు. ఇప్పటికైనా ఈ అభిషేక్ స్ఫూర్తిని నింపుకొని ఎవరూ బెదరకుండా, ఫెయిలైనా మళ్లీ పరీక్షలు రాసి విజయం సాధించాలని మనోసంకల్పంతో ముందుకెళ్లాలి అని కోరుకుందాం.