B Vinod Kumar: ఆలమట్టి ప్రాజెక్టు గేట్ల ఎత్తు పెంచేందుకు కర్ణాటక ప్రభుత్వం కుట్ర చేస్తుందని మాజీ ఎంపీ బి.వినోద్ కుమార్ ఆరోపించారు. సుప్రీంకోర్టులో స్టే ఉన్నప్పటికీ, కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమంగా భూసేకరణ చేస్తోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వినోద్ కుమార్ మండిపడ్డారు.
ఆలమట్టి ప్రాజెక్టు ఎత్తు పెంపు: ఉమ్మడి జిల్లాలకు ముప్పు
ఆలమట్టి ప్రాజెక్టు గేట్ల ఎత్తు పెంచడానికి వీలులేదని గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారని వినోద్ కుమార్ గుర్తుచేశారు. ఆ పిటిషన్ పై సుప్రీంకోర్టు స్టే కూడా ఇచ్చిందని ఆయన తెలిపారు. అయినప్పటికీ, కర్ణాటక ప్రభుత్వం అక్రమంగా 1 లక్ష 33 వేల ఎకరాల భూమిని సేకరిస్తోందని ఆరోపించారు.
Also Read: YS Jagan: ఎక్స్‌లో సీఎం చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్
సుప్రీంకోర్టులో విచారణ జరిగే సమయంలో, భూసేకరణ పూర్తయింది కాబట్టి గేట్ల ఎత్తు పెంచుకోమని కర్ణాటకకు అవకాశం దక్కుతుందని, దీనివల్ల తెలంగాణలోని ఉమ్మడి పాలమూరు, రంగారెడ్డి జిల్లాలకు కృష్ణా నది జలాలు తగ్గిపోయే ప్రమాదం ఉందని వినోద్ కుమార్ హెచ్చరించారు.
“ఇప్పటికైనా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి”
‘ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మొద్దు నిద్ర వీడి సుప్రీంకోర్టులో వెంటనే పిటిషన్ దాఖలు చేయాలి’ అని వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. కర్ణాటక ప్రభుత్వ కుట్రను అడ్డుకోకపోతే, తెలంగాణలోని దక్షిణ జిల్లాలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.