Karnataka: సీఎం కుర్చీపై మళ్లీ చర్చలు.. అధిష్ఠానం పిలుపు కోసం ఎదురుచూస్తున్న డీకే – సిద్ధరామయ్య

Karnataka: కర్ణాటక కాంగ్రెస్‌లో ముఖ్యమంత్రి పదవికి సంబంధించిన నాయకత్వ పోరు మరోసారి తెరపైకి వచ్చింది. సరైన సమయంలో తనను, ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను ఢిల్లీకి పిలుస్తామని పార్టీ అధిష్ఠానం తెలిపిందని ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ వెల్లడించారు. దీంతో సీఎం మార్పుపై జరుగుతున్న ఊహాగానాలకు మరింత బలం చేకూరింది.

బెంగళూరులో మీడియాతో మాట్లాడిన డీకే శివకుమార్, అసెంబ్లీ సమావేశాల అనంతరం అధిష్ఠానంతో భేటీ ఉంటుందా అన్న ప్రశ్నకు స్పందిస్తూ, “ఎప్పుడు ఢిల్లీ రావాలో హైకమాండ్ మాకు ఫోన్‌లో తెలియజేసింది. పిలుపు వచ్చినప్పుడు నేను, సిద్ధరామయ్య ఇద్దరం కలిసి వెళ్తాం. దొంగచాటుగా వెళ్లాల్సిన అవసరం లేదు” అని స్పష్టం చేశారు.

అయితే, మంగళవారం తాను అధికారిక కార్యక్రమాల నిమిత్తం ఢిల్లీకి వెళ్తున్నట్లు ఆయన తెలిపారు. కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ నిర్వహించే నదుల అనుసంధానంపై సమావేశంలో పాల్గొననున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా మహదాయి, కృష్ణా జలాల వివాదాలు, మేకెదాటు, అప్పర్ భద్ర ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలను కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్తానని, అవసరమైతే ప్రధానిని కూడా కలుస్తానని వివరించారు.

ఇదిలా ఉండగా, తాను ఐదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగుతానని, అధికార పంపకాలపై ఎలాంటి ఒప్పందం లేదని సీఎం సిద్ధరామయ్య శుక్రవారం అసెంబ్లీలో ప్రకటించారు. ఈ నేపథ్యంలో డీకే శివకుమార్ వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

అయితే, “ముఖ్యమంత్రి, నేను, హైకమాండ్ ఒక ఒప్పందానికి కట్టుబడి ఉన్నాం” అని డీకే శివకుమార్ చెప్పడంతో, కర్ణాటక సీఎం కుర్చీపై తుది నిర్ణయం ఇప్పుడు పూర్తిగా కాంగ్రెస్ అధిష్ఠానం చేతుల్లోకి వెళ్లినట్టుగా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *