Power Nap: సాధారణంగా మనలో చాలామందికి భోజనం చేయగానే చిన్న కునుకు తీయడం అలవాటు. దీనినే పవర్ నాప్ అంటారు. మరి శాసనసభా సమావేశాలు జరుగుతున్న సమయంలో ఎమ్మెల్యేలు మధ్యాహ్న భోజనం తరువాత ఇలా కునుకు తీయాలంటే ఎలా? తరచుగా అసెంబ్లీ సమావేశాల సమయంలో ఏదైనా ముఖ్యమైన చర్చ ఉంటే తప్ప.. మధ్యాహ్నం తరువాత ఎమ్మెల్యేల హాజరు తక్కువగా కనిపిస్తుంది. కనిపించిన ఎమ్మెల్యేలలో కూడా ఒక్కోసారి కునిపాట్లు పడుతున్న ఎమ్మెల్యేలను మనం టీవీల్లో చూసి నవ్వుకోవడం.. ఆ సంఘటనలు ట్రోల్ అవడం జరుగుతుంది.
Power Nap: ఇదిగో ఇలాంటి సంఘటనలు జరగకుండా.. అసెంబ్లీ జరుగుతున్నంత సేపు ఎమ్మెల్యేలు సభలోనే ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ ఖాదర్. “కొంచెం పని” ఉందంటూ ఎమ్మెల్యేలు మధ్యాహ్న భోజనం తరువాత బయటకు వెళ్లిపోకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. అసెంబ్లీ ప్రాంగణంలో రిక్లైనర్ ఛైర్స్ ఏర్పాటు చేయిస్తున్నారు. వీటిని అసెంబ్లీ జరుగుతున్న సమయంలో అద్దె ప్రాతిపాదికన తీసుకు వచ్చే ఏర్పాటు చేశారు. ఎందుకంటే, అసెంబ్లీ సమావేశాలు ఏడాది అంతా జరగవు. సంవత్సరంలో కొన్నిరోజులు జరుగుతాయి. అందుకే అద్దెకు తీసుకువస్తున్నాం అని స్పీకర్ ఖాదర్ వివరించారు.
Power Nap: గత సంవత్సరం జూలైలో జరిగిన సమావేశాల సందర్భంగా, ట్రయిల్ గా ఒక వాలు కుర్చీని ఏర్పాటు చేశారు. సమావేశంలో ఎమ్మెల్యేల హాజరును పెంచడానికి వివిధ చర్యలు తీసుకున్నారు.