Karimnagar: కన్నకూతురుపై ప్రేమ విషయంలో ఆమె తల్లిదండ్రులకు వచ్చిన అనుమానమే పెనుభూతమైంది. వారిని తొలిచి వేయసాగింది. పరువు పోతుందనే భయం వారిని వెన్నాడింది. పేగు తెంచుకొని పుట్టిన బిడ్డను అల్లారుముద్దుగా పెంచిన ఆ తల్లిదండ్రులే ఆమెను కడతేర్చారు. ఈ అమానుష ఘటన కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం శివరాంపల్లిలో చోటేచేసుకున్నది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటనపై నమోదైన కేసు వివరాలను హుజూరాబాద్ ఏసీపీ మాధవి వెల్లడించారు.
Karimnagar: సైదాపూర్ మండలం సైదాపూర్ గ్రామ పంచాయతీ పరిధి శివరాంపల్లికి చెందిన ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న అర్చన (16) అదే గ్రామానికి చెందిన ఓ వివాహిత యువకుడి ప్రేమలో పడిందని ఆమె తల్లిదండ్రులైన రాజు, లావణ్య అనుమానం కలిగింది. ఈ విషయంలో తమ పరువు పోతుందని మదన పడ్డారు. చెప్పినా తమ కూతురు వినడం లేదని మనోవేదనకు గురయ్యారు.
Karimnagar: అది స్నేహమో, ప్రేమో కనీసం నిర్ధారించుకోనూ లేదు ఆ తల్లిదండ్రులు. ఎవరో చెప్పిన మాటలు విన్నారో తెలియదు కానీ, తమ కుటుంబం పరువు పోయే పనిచేస్తుందని వారి కూతురుపై అనుమానం పెంచుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రాణం పోసి తమ పేగు తెంచుకొని పుట్టిన కన్నబిడ్డను ప్రాణం తీయాలని నిర్ణయించుకున్నారు.
Karimnagar: గత నెల 14న రాత్రి ఇంటిలోనే ఒంటరిగా నిద్రిస్తున్న సమయంలో బాలిక అర్చనను నిద్ర నుంచి లేపి మరీ బలవంతంగా పురుగుల మందు తాగించాయి ఆ కఠిన హృదయాలు. అయినా ఆ బాలిక చనిపోలేదని భావించిన ఆ తండ్రి గొంతు నులిమి చంపేశాడు. ఆ తర్వాతి రోజు తన కూతురు అనారోగ్యంతో చనిపోయిందని సైదాపూర్ పోలీసులకు బాలిక తండ్రి రెడ్డి రాజు ఫిర్యాదు చేశాడు.
Karimnagar: ఈ ఘటనపై పోలీసులు సమగ్ర విచారణ జరిపారు. ఈ విచారణలో అసలు విషయం వారికి తెలిసింది. గ్రామంలోనే నివాసం ఉండే వివాహితుడైన ఓ యువకుడు అర్చనను ప్రేమ పేరిట వేధించినట్టు తెలిసింది. ఆ తర్వాత తల్లిదండ్రులను విచారించగా, జరిగిన విషయాన్ని పోలీసుల ఎదుట వెళ్లగక్కారు. ఈ మేరకు హతురాలి తల్లిదండ్రులైన రెడ్డి రాజు, లావణ్యపై కేసు నమోదు చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు.
