Karimnagar: కరీంనగర్ జిల్లా బెజ్జంకి మండలంలోని దాచారం గ్రామంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అప్పుల ఊబిలో చిక్కుకున్న వడ్లకొండ శ్రీహర్ష, రుక్మిణి అనే దంపతులు పురుగుల మందు తాగి ప్రాణాలు తీసుకున్నారు. బెజ్జంకిలో బట్టల దుకాణం నడుపుతూ జీవనం సాగిస్తున్న ఈ కుటుంబంలో జరిగిన ఈ ఘోరం స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. వ్యాపారం బాగుంటుందని నమ్మిన శ్రీహర్ష, అప్పుల చిక్కుల్లో పడి చివరకు తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు.
కుటుంబ సభ్యుల సమాచారం ప్రకారం.. శ్రీహర్ష తన వ్యాపార అవసరాల కోసం పలువురి దగ్గర అప్పులు తీసుకున్నారు. అనిల్ అనే వ్యక్తికి లక్షల రూపాయల అప్పు ఇప్పించడంతో పాటు, అభిషేక్, రాజశేఖర్, భూపతిరెడ్డి, శ్రీనివాస్ వంటి వారి నుంచి కూడా డబ్బులు అప్పుగా తెచ్చుకున్నారు. అయితే, ఆ డబ్బును తిరిగి చెల్లించాలంటూ కొందరు వ్యక్తులు శ్రీహర్షపై తీవ్ర ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా అభిలాష్, భూపతిరెడ్డి అనే వ్యక్తులు తనను పదేపదే బెదిరించడంతో శ్రీహర్ష తీవ్ర మనస్తాపానికి గురయ్యారు.
చావు కంటే వేరే దారి కనిపించక, ఈ మానసిక ఒత్తిడిని భరించలేక శ్రీహర్ష తన భార్య రుక్మిణితో కలిసి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ సంఘటన గురించి తెలియగానే పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అప్పుల వ్యవహారం ఏమిటి? బెదిరింపులకు పాల్పడింది ఎవరు? అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఒక్కసారిగా దంపతులిద్దరూ కన్నుమూయడంతో దాచారం గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
