Kamalanda Bharati: ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు ఇటీవల ఆంధ్రప్రదేశ్ పేరు మార్పుపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కొత్త వివాదానికి దారితీశాయి. గరికపాటి చేసిన సూచనలను భువనేశ్వరి పీఠాధిపతి కమలానంద భారతి స్వామీజీ తీవ్రంగా తప్పుబట్టారు. స్వామీజీ, గరికపాటి వ్యాఖ్యలు వింత పోకడలకు నిదర్శనమని, అడిగే వారు లేరని అధిక ప్రసంగాలు చేయడం సరికాదని మండిపడ్డారు. ఆంధ్ర అనే పదానికి పురాణ కాలం నుంచే గుర్తింపు ఉందని ఆయన గుర్తు చేశారు.
రామాయణ కాలం నాటి పేరు.. మార్చడం ఎందుకు?
ఆంధ్రప్రదేశ్ పేరును ‘తెలుగునాడు’ గా మార్చాలన్న గరికపాటి ప్రతిపాదనపై కమలానంద భారతి ఘాటుగా స్పందించారు. “ఆంధ్రప్రదేశ్ అంటే తెలుగు కాదా? రామాయణ కాలం నుంచే ‘ఆంధ్ర’ అనే పదం వాడుకలో ఉంది. పేరు మార్చినంత మాత్రాన కొత్తగా వచ్చే సెంటిమెంట్ ఏమీ ఉండదు” అని స్వామీజీ స్పష్టం చేశారు. ఇలాంటి మేధావుల వల్లనే గతంలో ఏపీకి మద్రాసు దక్కకుండా పోయిందని ఆయన విమర్శించారు.
మా బ్రతుకులు మాకు తెలుసు.. గరికపాటికి చురకలు
గరికపాటి తెలంగాణలో స్థిరపడి, ఆంధ్ర ప్రాంతం గురించి మాట్లాడటంపై స్వామీజీ అభ్యంతరం వ్యక్తం చేశారు. “ఆయన తెలంగాణలో సెటిల్ అయ్యారు, ఆంధ్రాకు రారు. మా ప్రాంతం ఎలా ఉండాలి, మా బ్రతుకులు ఎలా ఉండాలో మాకు బాగా తెలుసు” అని పేర్కొన్నారు. ప్రవచనాలు చెప్పే వారు తమ పరిధి దాటి రాజకీయ లేదా ప్రాంతీయ సెంటిమెంట్లను దెబ్బతీసేలా మాట్లాడటం మంచిది కాదని హితవు పలికారు.
వింత ఆలోచనలు మానుకోవాలి
విద్యావంతులు, మేధావులు సమాజానికి మార్గదర్శకంగా ఉండాలి తప్ప, అనవసరమైన గందరగోళం సృష్టించకూడదని కమలానంద భారతి అన్నారు. ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని, చరిత్రను తక్కువ చేసేలా ఎవరు మాట్లాడినా అంగీకరించబోమని హెచ్చరించారు. ఈ వివాదం ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా హాట్ టాపిక్ గా మారింది, నెటిజన్లు రెండు వర్గాలుగా విడిపోయి తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
