Kamal Haasan: ప్రముఖ సినీ నటుడు, మక్కల్ నీది మయ్యం (MNM) పార్టీ అధినేత కమల్‌హాసన్ రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణస్వీకారం చేశారు. శుక్రవారం పార్లమెంట్‌లోని రాజ్యసభలో ఆయన ప్రమాణం చేశారు. తన మాతృభాష అయిన తమిళంలో ప్రమాణస్వీకారం చేయడం విశేషం. ఈ సందర్భంగా పార్లమెంటు వెలుపల మీడియాతో మాట్లాడుతూ, ఎంపీగా ప్రమాణం చేయనున్నందుకు ఎంతో గర్వంగా ఉందన్నారు.
కమల్‌హాసన్ 2018లో మక్కల్ నీది మయ్యం పార్టీని స్థాపించారు. ప్రస్తుతం ఈ పార్టీ విపక్ష ‘ఇండియా’ కూటమిలో భాగస్వామిగా ఉంది. గత సంవత్సరం (2024) జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తమిళనాడులో డీఎంకే, కాంగ్రెస్ కూటమికి కమల్‌హాసన్ మద్దతు ప్రకటించారు. ఆ ఒప్పందంలో భాగంగా, తమిళనాడులోని 39 లోక్‌సభ స్థానాలు, పుదుచ్చేరిలోని ఒక స్థానంలో ఎంఎన్‌ఎం పార్టీ డీఎంకే కూటమి తరపున ప్రచారం చేసింది.
ఈ ఒప్పందంలో ఒక ముఖ్యమైన భాగం ఏమిటంటే, 2025లో ఎంఎన్‌ఎంకు ఒక రాజ్యసభ స్థానం కేటాయించడానికి డీఎంకే నేతృత్వంలోని కూటమి అంగీకరించింది. ఈ ఒప్పందం ప్రకారమే, ఇటీవల డీఎంకే-ఎంఎన్‌ఎం కలిసి కమల్‌హాసన్‌ను రాజ్యసభకు పంపే విషయాన్ని ఖరారు చేశాయి. ఆ తర్వాత ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది.