Kamal Haasan Birthday: విలక్షణ అభినయానికి నిలువెత్తు రూపం… సలక్షణంగా ఆకట్టుకోవడంలో ఆయనకు ఆయనే సాటి… అందుకే నటుల్లో ఆయన ‘లోకనాయకుడు’గా జేజేలు అందుకుంటున్నారు… ఆయన కమల్ హాసన్ అని వేరే చెప్పాలా!?… నవంబర్ 7న కమల్ హాసన్ 70 ఏళ్ళు పూర్తి చేసుకుంటున్నారు… ఈ సందర్భంగా విషెస్ చెబుతూ కమల్ నటనావైభవాన్ని గుర్తు చేసుకుందాం.
ముచ్చటగా మూడు సార్లు జాతీయ స్థాయిలో ఉత్తమ నటునిగా నిలచిన తొలి స్టార్ హీరో కమల్ హాసన్… ఆ తరువాత కమల్ తో సరితూగినవారూ ఉన్నారు… ఆయనను అధిగమించిన వారూ ఉన్నారు… కానీ, కమల్ లాగా కళ కళ లాడిన వారు లేరనే చెప్పాలి… అందుకు కమల్ వైవిధ్యమైన అభినయం కారణమని చెప్పక తప్పదు.
Kamal Haasan Birthday: కమల్ హాసన్ ప్రతిభకు ఆకాశమే హద్దు అని చెప్పక తప్పదు… హీరో అయిన తరువాత ఎక్స్ పెరిమెంట్స్ తో సాగారు కమల్… తరువాత స్టార్ హీరోగా సాగుతున్న సమయంలోనూ కమల్ హాసన్ ప్రయోగాలతోనే పదనిసలు పలికించారు… ఆ పయనమే కమల్ హాసన్ ను తన తరం హీరోల్లో ప్రత్యేకంగా నిలిపింది… కమల్ హాసన్ ‘ఇండియన్-2’ పెద్దగా అలరించలేదు… ఎందుకంటే, అందులో కమల్ హాసన్ పాత్ర పరిధి ‘ఇండియన్’ మొదటి భాగంలో లాగా లేదు… అందువల్లే ‘ఇండియన్-2’ పరాజయం పాలయిందని చెప్పవచ్చు.
‘ఇండియన్-2’ పరాజయం పాలయినా, దానికి సీక్వెల్ గా ‘ఇండియన్-3’ రానుంది… రెండో భాగంలో చేసిన తప్పును డైరెక్టర్ శంకర్ మూడో భాగంలో చేయరనే భావించాలి… ఈ సారి కమల్ పాత్రకు అత్యంత ప్రాధాన్యమిస్తారనే అనిపిస్తోంది… అదలా ఉంటే కమల్ హాసన్ కు అల్లుడు వరుస అయ్యే మణిరత్నం దర్శకత్వంలో ‘థగ్ లైఫ్’ అనే చిత్రంలో నటిస్తున్నారు కమల్… ఈ చిత్రానికి మణిరత్నంతో కలసి కమల్ హాసన్ రచన చేయడం విశేషం!… అలా తనలోని బహుముఖ పజ్ఞను చిత్రసీమలో చాటుకుంటూనే రాజకీయాల్లోనూ సాగుతున్నారు కమల్… నిజం చెప్పాలంటే కమల్ హాసన్ పాలిటిక్స్ లో పరాజయం పాలయ్యారు… అయినా పట్టువదలని విక్రమార్కునిలా తమిళనాడులో అధికారం సాగిస్తోన్న డి.యమ్.కె. పార్టీతో కలసి సాగుతున్నారు కమల్.
Kamal Haasan Birthday: ఇప్పటికీ కొత్తదనంతో కూడినది ఏదైనా తన దరి చేరితే వదలిపెట్టరు కమల్. అందుకుని నిదర్శనం ‘అమరన్’. శివకార్తికేయన్ హీరోగా రూపొందిన ఈ సినిమాను నిర్మించింది కమల్ కి చెందిన ‘రాజ్ కమల్ ఇంటర్నేషనల్’ సంస్థనే. తమిళనాట శివకార్తికేయన్ ను కాబో్యే సూపర్ స్టార్ ని చేసిందీ సినిమా. ఇక కార్తీ నటించిన ‘మెయ్యలగన్’లో కమల్ పాడిన పాట సూపర్ హిట్. కమల్ హాసన్ వాయిస్ ఆ పాటకు ప్రాణం పోస్తుందని భావించిన గోవింద్ వసంత్, ప్రేమ్, కార్తీ అడగ్గానే ఆ పాట పాడారు కమల్. అది సినిమాకే హైలైట్ అయింది.
తన ప్రతి చిత్రంలో ఏదో విధంగా వైవిధ్యం చూపించాలన్నదే కమల్ హాసన్ తపన… ఇక తన సీనియర్ యాక్టర్స్ అయిన యన్టీఆర్, శివాజీ గణేశన్ లాగా విలక్షణమైన పాత్రలు పోషించాలన్న అభిలాష కూడా కమల్ లో ఎంతో ఉంది… అందువల్లే అనేక చిత్రాలలో విలక్షణమైన పాత్రలు ధరించి ఆకట్టుకున్నారు.
కమల్ హాసన్ కు అభినయంపై ఎంతటి అభిలాష ఉందో అన్న దానికి నిలువెత్తు నిదర్శనం ‘దశావతారం’… ఆ చిత్రంలో పది పాత్రల్లో కమల్ హాసన్ మేకప్ తో మేజిక్ చేశారు… తన నటనతో లాజిక్ నే మరిపించారు… అలాంటి జిమ్మిక్స్ చేయడం కమల్ కు వెన్నతో పెట్టిన విద్య… ఇప్పుడున్న నటుల్లో అలాంటి విన్యాసాలు కమల్ కే సాధ్యం అని అంగీకరించక తప్పదు.
Kamal Haasan Birthday: స్వతహాగా నాట్యంలో ప్రావీణ్యం సంపాదించిన కమల్ హాసన్, నృత్యం నేపథ్యంలోనూ విలక్షణమైన పాత్రలు ధరించడం విశేషం… స్వీయ దర్శకత్వంలో కమల్ హాసన్ నటించి, తెరకెక్కించి, నిర్మించిన ‘విశ్వరూపం’లో ఆ విలక్షణం ఇట్టే కనిపిస్తుంది… ఆ సినిమాలోని కథాంశం సైతం వైవిధ్యంగా నిలచి, రాజకీయాల ఆటుపోటులు ఎదుర్కొని జనం మదిని గెలిచింది.
జనాన్ని ఎంతగా అలరించినా సరే, మరింతగా మెప్పించాలన్నదే కమల్ హాసన్ తపన… ఆ వైనంలో సాగుతూ, జనానికి ఎంతో వైవిధ్యాన్ని అందిస్తూ ఉంటారు… రెగ్యులర్ కమర్షియల్ ఫార్ములాకు కమల్ హాసన్ దూరంగా జరిగి చాలా కాలమైంది… అందుకే ఆయన అన్ని చిత్రాలు వ్యాపారపరంగా విజయం సాధించక పోవచ్చు… కానీ, నటునిగా కమల్ మాత్రం ఎప్పుడూ ఫెయిల్యూర్ కావడం లేదు.
కమల్ హాసన్ అభినయం కోట్లాది మందిని పులకింప చేసింది… అయితే ఆయన ముక్కుసూటి తనం మాత్రం కొందరికి మింగుడు పడదు… ప్రశ్నించే గళంతో రాజకీయాల్లో నిలచి పరాజయం చవిచూశారు కమల్… తమ హీరో సకల కళావల్లభుడని, ఏదో ఒకరోజున పాలిటిక్స్ లోనూ విజయం సాధిస్తారనే అభిలాషతో ఉన్నారు అభిమానులు.
Kamal Haasan Birthday: కమల్ హాసన్ నటనాపర్వమే చిత్రవిచిత్రం అని చెప్పక తప్పదు… సదా అలరించడమే కమల్ కు తెలిసిన విద్య… అలాగే కమల్ తెలుగు జనం మదిని గెలిచారు… ఈ నాటికీ మనవాళ్ళ మదిలో చెదరకుండా నిలిచారు.
కమల్ హాసన్ అభినయాన్ని నోట పట్టుకొనే పుట్టాడని అంటారు… ఆరేళ్ళ పసివయసులోనే కమల్ హాసన్ తెరపై తనదైన రీతిలో ఆకట్టుకున్నాడు… పైగా మహానటి సావిత్రి, ఆమె భర్త జెమినీ గణేశన్ తో నటిస్తూ తొలిసారి తెరపై కనువిందు చేయడం విశేషం… కమల్ మొదటి సినిమా ‘కలత్తూర్ కన్నమ్మ’లో అతని ముద్దు ముద్దు నటన జనాన్ని భలేగా ఆకట్టుకుంది.
నిజం చెప్పాలంటే కమల్ హాసన్ కు తమిళనాడులో కన్నా మిన్నగా తెలుగునాట అభిమానగణాలు ఉన్నాయి… తొలి నుంచీ తనదైన అభినయంతో కమల్ ఆకట్టుకున్నారు… తొలి చిత్రం ‘అంతులేని కథ’తో మొదలు ఇప్పుడొస్తున్నకమల్ సినిమాల దాకా ఆయనను తెలుగువారు అభిమానిస్తూనే ఉన్నారు.
Kamal Haasan Birthday: ఆరంభంలో యువతను కిర్రెక్కించే చిత్రాలలో కమల్ హాసన్ నటించారు… ఆయన గురువు కె.బాలచందర్ సైతం కమల్ కు తగ్గ పాత్రలను రూపొందించి మరీ సినిమాలు తెరకెక్కించారు… సదరు చిత్రాలలో కమల్ హాసన్ వైవిధ్యమైన నటన ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది… ఈ నాటికీ సదరు చిత్రాలు అభిమానులకు గిలిగింతలు పెడుతూనే ఉండడం విశేషం!
నిజమే, ఏ తీగె పువ్వునో, ఏ కొమ్మ తేటినో కలిపినట్టుగానే కమల్ హాసన్ ను తెలుగు ప్రేక్షకులను విధి కలిపేసింది… అప్పట్లో కమల్ కొన్ని స్ట్రెయిట్ తెలుగు మూవీస్ లోనూ నటించి ఎంతగానో అలరించారు… ఆ నాటి నుంచే కమల్ హాసన్ సినిమాలంటే తెలుగువారికి అభిమానం పెరిగింది… అది ఈ నాటికీ కొనసాగుతూనే ఉండడం విశేషం.
కమల్ హాసన్ నర్తనం ఆ రోజుల్లో యువకులను ఎంతగానో ఆకట్టుకుంది… కొందరు అబ్బాయిలు కమల్ ను చూసే డాన్స్ ప్రాక్టీస్ చేయడం ఆరంభించారు… అప్పట్లో ‘డిస్కో’ సాంగ్స్ కు విపరీతమైన క్రేజ్ ఉండేది… అనేక చిత్రాలలో కమల్ ‘డిస్కో సాంగ్స్’ యూత్ ను ఉర్రూతలూగించాయి… ఆ రోజుల్లో కమల్ హాసన్ చిత్రాలలో రజనీకాంత్ సైడ్ హీరోగా, విలన్ గా నటించేవారు… కమల్, రజనీ జోడీ తెరపై అలరించిన తీరును ఇప్పటికీ అభిమానులు మరచిపోలేరు.
Kamal Haasan Birthday: కమల్ హాసన్ నటించిన తెలుగు చిత్రాలు ఇక్కడి జనాన్ని ఎంతగానో మురిపించాయి… మన తెలుగు స్టార్స్ సినిమాల స్థాయిలో వసూళ్ళ వర్షం కురిపించాయి… పొరుగు రాష్ట్రాల్లో ఉన్న తెలుగువారినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి… ‘మరోచరిత్ర’ తెలుగు సినిమా మద్రాసులో ఏకంగా 75 వారాలు ప్రదర్శితమయింది… దీనిని బట్టే, తమిళులు, తెలుగువారు కమల్ ను ఎంతగా అభిమానించారో తెలిసి పోతుంది.
కమల్ హాసన్ ఓ వైపు తమిళంలో తకధిమితై ఆడేస్తూనే మరోవైపు తెలుగులోనూ తడాఖా చూపించారు… ఆయన నటించిన స్ట్రెయిట్ తెలుగు మూవీస్ తమిళ చిత్రాల కంటే మిన్నగా వసూళ్ళు రాబట్టాయి… ఆ సమయంలో తాను తెలుగువాడిగా పుట్టకపోవడం నిజంగా దురదృష్టమే అనీ కమల్ వ్యాఖ్యానించడం గమనార్హం!
తమిళనాడులో కమల్ హాసన్ చిత్రాలు రికార్డులు నెలకొల్పడంలో గొప్పేమీ లేదు.. ఎందుకంటే వారి స్టార్ హీరో ఆయన… అయితే కమల్ తెలుగు చిత్రాలు ‘సాగరసంగమం, స్వాతిముత్యం’ కర్ణాటకలో సంచలన విజయం సాధించడం మరపురానిది…మరచిపోలేని విజయం… కమల్ లాగా తెలుగు చిత్రాలతో అనుబంధం ఉన్న మరో పరభాషా తార మనకు కనిపించరు.
Kamal Haasan Birthday: కమల్ హాసన్ కు నటన అనేది ఓ తీరని తృష్ణ… అందులో సదా మునకలేస్తూనే ఉంటారు… అయినా తనివి తీరక కొత్త కొత్త ప్రయోగాలు చేయడం ఆయనకు హాబీ… అదే జనాన్ని కట్టి పడేస్తోంది.
కమల్ హాసన్ అభినయాన్ని ఈ రోజున ఎంతోమంది అభిమానిస్తున్నారు…అయితే ఆరంభంలో ఆయనకు కూడా నటన రాదని ఎద్దేవా చేసిన వారున్నారు… కమల్ లోని నటునికి జాతీయ స్థాయిలో ఉత్తమ నటునిగా పట్టాభిషేకం చేసిన ఘనత దర్శకుడు బాలు మహేంద్రకే దక్కుతుంది… కమల్ తో బాలూ మహేంద్ర తెరకెక్కించిన ‘మూడ్రం పిరై’తో తొలి నేషనల్ అవార్డును అందుకున్నారు… ఈ చిత్రం తెలుగులో ‘వసంత కోకిల’గా జనాన్ని ఎంతగానో మురిపించింది.
కమల్ హాసన్ లోని నటుణ్ణి మరో కోణంలో చూపిన ఘనత మణిరత్నంకే దక్కుతుంది… కమల్ పర్సనాలిటీకి తగ్గ పాత్రతో ‘నాయకుడు’ తెరకెక్కించి, తమిళ, తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు మణిరత్నం… ‘నాయకుడు’తో రెండో నేషనల్ అవార్డును సొంతం చేసుకున్నారు కమల్ హాసన్… ఈ సినిమా సైతం కమల్ అభిమానులకు ఓ మరపురాని అనుభూతిని అందించింది.
Kamal Haasan Birthday: కమల్ హాసన్ కు జాతీయ స్థాయిలో ఉత్తమనటునిగా అవార్డులు లభించిన సమయంలో కొన్ని విమర్శలూ వినిపించాయి… ఆ సమయంలో జ్యూరీలో తమిళులు అధికంగా ఉండడం ఓ కారణమని కొందరు అన్నారు… కమల్ అన్న చారు హాసన్ జ్యూరీలో ఉన్న కారణంగానే నేషనల్ అవార్డ్స్ దక్కాయనీ మరికొందరి మాట… అయితే కమల్ హాసన్ మూడో సారి ‘ఇండియన్’తో బెస్ట్ యాక్టర్ గా నేషనల్ అవార్డు అందుకున్న సమయంలో వాళ్ళన్నయ్య జ్యూరీలో లేరు… విమర్శకులకు ఈ అవార్డు సమాధానం చెప్పిందని కమల్ ఫ్యాన్స్ ఎంతగానో మురిశారు.
తెలుగునాట తన తరం నటుల కంటే ముందుగానే కొన్ని నంది అవార్డులను తన ఖాతాలో వేసుకున్నారు కమల్ హాసన్… ‘సాగరసంగమం’తో తొలిసారి ఉత్తమ నటునిగా నంది అవార్డు అందుకున్న కమల్ ఆ తరువాత ‘స్వాతిముత్యం’, ‘ఇంద్రుడు-చంద్రుడు’తోనూ బెస్ట్ యాక్టర్ గా నందిని నడిపించుకుంటూ వెళ్ళారు… తెలుగులోనూ మూడు సార్లు నందిని సొంతం చేసుకున్న తొలి నటునిగా నిలిచారు కమల్..
Kamal Haasan Birthday: తెలుగునాట తన తరం నటుల కంటే ముందుగానే కొన్ని నంది అవార్డులను తన ఖాతాలో వేసుకున్నారు కమల్ హాసన్… ‘సాగరసంగమం’తో తొలిసారి ఉత్తమ నటునిగా నంది అవార్డు అందుకున్న కమల్ ఆ తరువాత ‘స్వాతిముత్యం’, ‘ఇంద్రుడు-చంద్రుడు’తోనూ బెస్ట్ యాక్టర్ గా నందిని నడిపించుకుంటూ వెళ్ళారు… తెలుగులోనూ మూడు సార్లు నందిని సొంతం చేసుకున్న తొలి నటునిగా నిలిచారు కమల్..
కమల్ హాసన్ సీనియర్స్ లో యన్టీఆర్, ఏయన్నార్, శివాజీగణేశన్ బహు పాత్రలతో రంజింప చేశారు… అలాగే తానూ అలరించాలనే అభిలాష కమల్ కు ఎంతగానో ఉండేది… తాను వీరాభిమానించే శివాజీగణేశన్ ‘నవరాత్రి’ తమిళ చిత్రంలో తొమ్మిది పాత్రల్లో అలరించారు… ‘నవరాత్రి’ తెలుగులో ఏయన్నార్ తో అదే టైటిల్ తో తెరకెక్కింది… తన అభిమాన నటుల కన్నా మిన్నగా కమల్ పది పాత్రలతో ‘దశావతారం’ చూపించారు… అదీ నటనపై ఆయనకున్న మక్కువకు నిదర్శనం.
Kamal Haasan Birthday: కమల్ హాసన్ కు నటనపై ఉన్న తృష్ణను గురించి ఎంత చెప్పుకున్నా కొంతే అవుతుంది… 70 ఏళ్ళు పూర్తయినా, ఇప్పటికీ అభినయంతో అలరించాలనే తపనతోనే ఉన్నారు కమల్… ‘భారతీయుడు’ సీక్వెల్ అంతగా అలరించక పోయినా, ఇంకా విలక్షణ పాత్రలు పోషించాలనే కమల్ తపిస్తున్నారు… ప్రభాస్ ‘కల్కి 2898 ఏడి’లో ప్రతినాయకునిగా కొద్ది సేపే కనిపించినా, రాబోయే ఆ సినిమా సీక్వెల్ లో జనం కమల్ నటవిశ్వరూపం చూస్తారని అభిమానులు అంటున్నారు… మణిరత్నం దర్శకత్వంలో ఎన్నో ఏళ్ళ తరువాత ‘థగ్ లైఫ్’లో నటిస్తున్నారు కమల్… ఈ సినిమాపై అప్పుడే జనాల్లో క్రేజ్ నెలకొంది… అలాగే ‘ఖాకీ’ డైరెక్టర్ హెచ్.వినోద్ డైరెక్షన్ లోనూ నటించడానికి సై అన్నారు కమల్… ఈ చిత్రాలన్నిటా నవతరం నటీనటులతో కలసి కమల్ నటించనున్నారు… వరుస సినిమాలతో బిజీ కారణంగానే తమిళ ‘బిగ్ బాస్’ కి సైతం దూరంగా జరిగారు కమల్. మరి రాబోయే సినిమాలతో కమల్ హాసన్ ఏ తీరున మురిపిస్తారో చూడాలి.
ఏడుపదులు దాటినా, ఇంకా కమల్ ఓ విద్యార్థిలాగే సాగుతున్నారు… అందుకే వైవిధ్యం ఆయన వెంటే పరుగెడుతోంది… ఆ పరుగులో కమల్ ఎప్పుడూ విజేతగానే నిలుస్తారని చెప్పవచ్చు… కమల్ హాసన్ మరిన్ని చిత్రాలతో మనల్ని మురిపిస్తారని ఆశిద్దాం.