Kalvakuntla Kavitha:గత కొన్ని రోజులుగా తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వైఖరి హాట్ టాపిక్‌గా మారింది.బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి తన తండ్రి అయిన కేసీఆర్‌కే ఆమె లేఖ రాయడంతో ఒక్కసారిగా రాజకీయాలు వేడెక్కాయి. పార్టీ వైఖరిపై, తనకు పార్టీలో జరుగుతున్న అన్యాయంపై ఆమె విల్లు ఎక్కుపెట్టారు. దానిపై రాద్ధాంతం సద్దుమణగక ముందే తాజాగా మీడియా చిట్‌చాట్‌లో కవిత మరో సంచలనాత్మక వ్యాఖ్యలు చేశారు.
Kalvakuntla Kavitha:బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేసే కుట్ర జరుగుతున్నదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణలు చేశారు. తాను జైలులో ఉన్నప్పుడే ఈ ప్రతిపాదన వచ్చిందని తెలిపారు. అయితే తాను ఆ ప్రతిపాదనను వ్యతిరేకించానని ఆమె చెప్పారు. బీజేపీలో బీఆర్ఎస్ పార్టీని విలీనం చేయొద్దని తాను ఖరాకండిగా చెప్పానని స్పష్టం చేశారు.
Kalvakuntla Kavitha:తాను కేసీఆర్ కు రాసిన లేఖను ఎవరు బయటపెట్టారని కవిత భగ్గుమన్నారు. నాకు వెన్నుపోటు రాజకీయాలు తెలియదని స్పష్టం చేశారు. ముందు ఒకటి, వెనుక ఒకటి చెప్పడం రాదని చెప్పారు. ఇంటి ఆడబిడ్డపై పెయిడ్ ఆర్టిస్టులతో మాట్లాడిస్తే ఏమొస్తుందని నిలదీశారు. తాను జైలుకెళ్లినప్పుడే బీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్టు కవిత చెప్పారు. అయితే ఆనాడు తన తండ్రి కేసీఆర్ రాజీనామా చేయొద్దని వారించారని చెప్పారు.
Kalvakuntla Kavitha:ఏదైనా ఉంటే పార్టీ ఫోరం లోపల మాట్లాడాలి.. అని అంటున్నారని, పార్టీ ఫోరంలో ఏమున్నదని తాను బయటే మాట్లాడుతున్నానని చెప్పారు. నేను కేసీఆర్ లాగ తిక్కదాన్ని, నేనెవరికీ భయపడను అని కవిత చెప్పారు. లేఖ ఎందుకు రాశావని అంటున్నారని, ఒక్క లేఖ కాదని, 100 లేఖలు రాశానని చెప్పుకొచ్చారు. పార్టీని నడిపించే సత్తా మీకు లేదు.. నాకు నీతులు చెప్తున్నారా? అంటూ ప్రశ్నించారు. లీకు వీరులను బయటపెట్టకుండా, నాపై గ్రీకు వీరుల్లాగా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ మునిగిపోయే నావలాంటింది.. ఆ పార్టీతో రాయబారాలు తనకెందుకని కల్వకుంట్ల కవిత తేల్చి చెప్పారు. తనను కావాలనే ఎంపీ ఎన్నికల్లో ఓడించారని ఆవేదన వ్యక్తంచేశారు. బీఆర్ఎస్‌లో కేసీఆర్ నాయకత్వం తప్ప, మరెవ్వరి నాయకత్వాన్ని తాను అంగీకరించనని స్పష్టం చేశారు. కోవర్టులు ఉన్నప్పుడు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.
Kalvakuntla Kavitha:కవిత ఈ వ్యాఖ్యలను బట్టి బీఆర్ఎస్ ను వీడాలనే నిర్ణయించుకున్నారని అర్థమవుతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. జూన్ 2న తెలంగాణ రాష్ట్రావిర్భావ దినోత్సవాన కొత్త పార్టీ ఏర్పాటు ప్రకటన చేస్తుందని భావిస్తున్నారు. ఈ మేరకు ఆమె చకచకా ఏర్పాట్లు చేసుకుంటున్నారని తెలుస్తున్నది.

