Kalvakuntla Kavitha: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చేపట్టిన ‘జాగృతి జనం బాట’ కార్యక్రమంలో భాగంగా నల్లగొండ జిల్లాలో పర్యటించారు. ఈ పర్యటన సందర్భంగా జిల్లా కేంద్రంలో మున్సిపల్ సిబ్బంది తన ఫ్లెక్సీలు, కటౌట్‌లను తొలగించడంపై ఆమె తీవ్రంగా స్పందించారు. ప్రజా సమస్యలను ప్రస్తావిస్తున్నందుకే తన ఫ్లెక్సీలను తీయించారని, ఇది సరైన పద్ధతి కాదని కవిత విమర్శించారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై పరోక్షంగా వ్యాఖ్యలు చేస్తూ, ప్రజల సమస్యలు అడుగుతున్నందుకు ఫ్లెక్సీలు తీయిస్తారా? అని ప్రశ్నించారు. చేతనైతే ప్రభుత్వం సమస్యలను త్వరగా పరిష్కరించాలని ఆమె డిమాండ్ చేశారు.
నల్లగొండకు కృష్ణా జలాలు ఏవి? – ప్రభుత్వాన్ని నిలదీసిన కవిత
నల్లగొండ జిల్లా కేంద్రంలో మీడియా సమావేశంలో మాట్లాడిన కవిత, జిల్లాకు సంబంధించిన ప్రధాన సమస్యలను ప్రస్తావించారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా నల్లగొండ జిల్లాకు కృష్ణా జలాలు పూర్తిగా అందలేదనేది వాస్తవం అని ఆమె అన్నారు. గతంలో బీఆర్ఎస్, ప్రస్తుతం కాంగ్రెస్ – ఏ పార్టీ కూడా నల్లగొండకు సాగునీరు అందించడంలో విజయం సాధించలేకపోయిందని విమర్శించారు. ప్రభుత్వాలను నిలదీయడానికి, సమస్యలను అడగడానికే తాను ‘జాగృతి జనం బాట’ చేపట్టానని స్పష్టం చేశారు.
Also Read: Gold Price Today: మళ్లీ మహిళలకు షాక్ ఇస్తున్న పసిడి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు రేట్లు ఇవే..!
సుంకిశాల లిఫ్ట్ ఇరిగేషన్ కాంట్రాక్టర్‌పై ప్రభుత్వం కచ్చితంగా చర్యలు తీసుకోవాలని, అలాగే ఎస్‌ఎల్‌బీసీ ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపించాలని ఆమె డిమాండ్ చేశారు. నాగార్జున సాగర్ ఎడమ కాలువను రాష్ట్ర ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకోవాలని, లేదంటే కృష్ణా జలాలను నల్లగొండకు తీసుకురాకపోతే భూ నిర్వాసితులతో కలిసి ముఖ్యమంత్రి ఇంటిని ముట్టడిస్తామని కవిత హెచ్చరించారు.
వైద్యం, విద్యుత్ సమస్యలపై కాంగ్రెస్ నిర్లక్ష్యం
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై కూడా కల్వకుంట్ల కవిత తీవ్ర విమర్శలు చేశారు. బీఆర్ఎస్‌ను తిట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, ఇప్పుడు అదే నిర్లక్ష్యాన్ని కొనసాగిస్తోందని ఆమె ఆరోపించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎపిడ్యూరల్ మెడిసిన్ అందుబాటులో లేకపోవడం తనను బాధించిందని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వెంటనే ఎపిడ్యూరల్ మెడిసిన్‌ను అందుబాటులోకి తీసుకురావాలని ఆమె డిమాండ్ చేశారు. అంతేకాకుండా, కాంగ్రెస్ ప్రభుత్వం భూదాన్ భూములను స్వాధీనం చేసుకోవాలని, యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌ను ఎప్పుడు అందుబాటులోకి తీసుకువస్తారో ముఖ్యమంత్రి స్పష్టంగా చెప్పాలని కవిత డిమాండ్ చేశారు. సీఎం ఆదేశాలను జిల్లా కలెక్టర్‌లు కూడా పట్టించుకోవడం లేదని ఆమె పేర్కొన్నారు.

