Kalvakuntla Kavitha: ఇటీవల తెలంగాణ రాజకీయాల్లో ఫైర్‌బ్రాండ్‌గా నిలిచిన ఎమ్మెల్సీ కవిత వెనక్కి తగ్గారా? ఎవరైనా తగ్గించారా కేసీఆర్‌ను ఇబ్బంది పెడుతున్నారంటూ హరీశ్‌రావు, సంతోష్‌రావులపై ఆమె సంచలన ఆరోపణలు చేయగా, కౌంటర్‌గా హరీశ్ వ్యాఖ్యలు సుతిమెత్తగా ఉండటానికి ఇదే కారణమా? దీనంతటికీ బలమైన కారణం కేసీఆరేనా? లేదా? ఒకడుగు వెనక్కి, మూడడుగులు ముందుకు నానుడిని కవిత నిజం చేస్తుందా? అంటే మొదటిదే కావచ్చేమోననే సంకేతాలు వినిపిస్తున్నాయి.
Kalvakuntla Kavitha: బీఆర్ఎస్ బహిష్కృత నాయకురాలు, తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలైన కవిత ఇటీవల సంచలన ఆరోపణలు చేశారు. గత ఆరు నెలలుగా కేసీఆర్‌పై, కేటీఆర్, హరీశ్‌రావు, సంతోష్‌రావు, జగదీశ్‌రెడ్డిపై ఘాటైన వ్యాఖ్యలు కూడా చేస్తూ వచ్చారు. కేసీఆర్ వెనుక దెయ్యాలు ఉన్నాయంటూ కవిత ధ్వజమెత్తారు. నాలుగు రోజుల క్రితం హరీశ్‌రావు, సంతోష్‌పైన కవిత సంచలన ఆరోపణలు గుప్పించారు.
Kalvakuntla Kavitha: ఇక వేచి చూడకుండా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఏకంగా కవితను బహిష్కరించారు. అయితే వ్యూహాత్మకంగా బీఆర్ఎస్ పార్టీలో కవితను ఘాటుగా ఏఒక్క నేత కూడా విమర్శించడం లేదు. ఆమె వ్యాఖ్యలను ఖండిస్తూ, వివరణ ఇస్తూ వచ్చారు తప్ప ఆమెపై పరుష పదజాలాన్ని మాత్రం వాడలేదు. కేసీఆర్ సస్పెండ్ నిర్ణయం తీసుకున్నారు.. కవిత బహిష్కరణకు గురయ్యారు.. కానీ ఇక్కడే తండ్రీకూతురు బంధం కవితను దూరం చేసుకోలేకపోతున్నదని తెలుస్తున్నది.
Kalvakuntla Kavitha: బహిష్కరణ అనంతరం కవిత చేసిన వ్యాఖ్యలతోనే ఆమె కాస్త వెనక్కి తగ్గినట్టు తేలిపోయింది. ఈ ఆరునెలల కాలంలో కేటీఆర్‌ను కనీసం సంబోధించలేదు. కానీ బహిష్కరణ అనంతరం కేటీఆర్‌ను సంబోధిస్తూ, అన్నా.. తాను చేసిన ఆరోపణలతో తనతో ఎందుకు మాట్లాడలేదు.. అని వేడుకున్నట్టుగానే మాట్లాడింది తప్ప విమర్శలు గుప్పించలేకపోయింది. పదునైనా పదాలను వాడలేదు. హరీశ్, సంతోషలపై మళ్లీ వ్యాఖ్యలు చేయలేకపోయింది. ఆమె వెనక్కి తగ్గిందనే సంకేతాలకు ఇది మొదిటిది.
Kalvakuntla Kavitha: ఇక రెండోది ఏమిటంటే.. కవిత నుంచి ఆరోపణలు ఎదుర్కొన్న బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్‌రావు సెప్టెంబర్ 6న లండన్ పర్యటన నుంచి తెలంగాణకు తిరిగి వచ్చారు. వచ్చీరాగానే మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ నుంచి వచ్చిన పిలుపు మేరకు నేరుగా ఆయన వద్దకే చేరుకున్నారు. తన రాజకీయ జీవితం తెరిచిన పుస్తకమని, కేసీఆరే తనకు సర్వస్వమని, ఆయనను ముఖ్యమంత్రిగా చేయడమే లక్ష్యంగా పనిచేద్దామని, ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడుదామని, తనపై చేసిన ఆరోపణలకు ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నానని చెప్పారు. అంటే కవిత ఆరోపణలను తీవ్రంగా పరిగణించలేదన్నమాట.
Kalvakuntla Kavitha: మూడో అంశం ఏమిటంటే.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్ ఇంత వరకూ కవిత విషయంలో ఎలాంటి వ్యాఖ్యలూ చేయలేదు. సోదరి అనే అనుబంధంతోనే కావచ్చని విశ్లేషకుల అంచనా. దీనికంతటికీ కూతురునైతే బహిష్కరించినా కేసీఆర్‌కు కవితపై మమకారం పోలేదని, కొన్నాళ్లు సద్దుమణిగాక మళ్లీ దగ్గరికి చేర్చుకుందామనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తున్నది. ఆ వైఖరితోనే కవిత ఆరోపణలపై కేసీఆర్.. సంతోష్‌ను సైలెంట్ చేసి, హరీశ్‌ను సాఫ్ట్ చేసి, కేటీఆర్ నోరు మూయించినట్టు భావిస్తున్నారు. దీనిపై భవితపై ఆలోచించిన కవిత కూడా కాస్త వెనక్కి తగ్గినట్టు తెలుస్తున్నది. మళ్లీ బీఆర్ఎస్‌యే భావి రాజకీయ జీవితమని ఆమె భావిస్తున్నట్టు విశ్లేషిస్తున్నారు.