Kalvakuntla Kavitha: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అన్నీ వ్యవస్థలు కుప్పకూలిపోయాయని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పై ఆమె “అవినీతి చక్రవర్తి” అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
పేదల పరిస్థితి దయనీయంగా మారిందని ఆమె అన్నారు. ప్రజలకు నిత్యావసరమైన విద్య, వైద్యసౌకర్యాలు కూడా అందుబాటులో లేవని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రులు కాంట్రాక్టర్ల నుండి కమీషన్లు తీసుకుంటున్నారని ఆరోపించారు.
నిధుల విషయంలో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని కవిత తెలిపారు. పుణె మెట్రోకు కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తే, తెలంగాణకు మాత్రం ఒక్క పైసా కూడా ఇవ్వలేదని విమర్శించారు. ఇప్పటివరకు కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన అప్పులు ఎన్ని? వాటి వివరాలు ప్రజలకు ఎందుకు చెప్పట్లేదని ప్రశ్నించారు.
ఇది కూడా చదవండి: YS Jagan: నేడు వైఎస్ జగన్ క్వాష్ పిటిషన్‌పై విచారణ!
కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోందన్నారు. గతంలో కేసీఆర్ హయాంలో REC సంస్థ నుంచి అప్పులు తీసుకుని 2030 వరకు క్రమంగా కిస్తీలు చెల్లిస్తామని ఒప్పుకున్నప్పటికీ, ప్రస్తుతం రేవంత్ సర్కార్ కిస్తీల చెల్లింపులో విఫలమవుతోందని ఆమె పేర్కొన్నారు.
కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఇంకా ప్రారంభం కాకముందే కాంట్రాక్ట్ సంస్థకు అడ్వాన్స్ చెల్లించడం అవినీతికి నిదర్శనమని కవిత ఆరోపించారు.
పోలవరం ప్రాజెక్టు వల్ల భద్రాచలం ప్రాంతం సహా ఐదు గ్రామాలకు అన్యాయం జరుగుతోందని, చంద్రబాబు ప్రభుత్వ అనుభవంతో గోదావరి–కావేరి లింక్ పేరిట నీళ్లు తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు.
రేవంత్ ప్రభుత్వం మొద్దునిద్ర పట్టి రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టిందని ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు.