Kavitha: తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య మార్పు చోటుచేసుకుంది. ఎమ్మెల్సీ కవిత సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన స్వచ్ఛంద సంస్థ అయిన ‘తెలంగాణ జాగృతి’ని ఇకపై రాజకీయ పార్టీగా మారుస్తున్నట్లు ఆమె అధికారికంగా ప్రకటించారు. రాబోయే ఎన్నికల్లో ఈ కొత్త పార్టీ బరిలోకి దిగుతుందని, ప్రజల పక్షాన నిలబడి పోరాడుతుందని స్పష్టం చేశారు. తాను ఒక వ్యక్తిగా శాసనమండలి నుంచి బయటకు వెళ్తున్నానని, కానీ త్వరలోనే ఒక గొప్ప ‘రాజకీయ శక్తి’గా తిరిగి వస్తానని ఆమె ధీమా వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ ప్రభుత్వంపై కవిత తీవ్ర విమర్శలు గుప్పించారు. గత తొమ్మిదిన్నరేళ్లలో లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టినప్పటికీ, పేదలకు ఇళ్లు ఎందుకు కట్టించి ఇవ్వలేదని ఆమె ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమకారులను బీఆర్ఎస్ ఏనాడూ గౌరవించలేదని, నిరుద్యోగులను మోసం చేసిందని ఆరోపించారు. రాష్ట్ర అస్తిత్వాన్ని కాపాడటం కోసమే తాను కొత్త పార్టీని పెడుతున్నానని, దీని విధివిధానాలను త్వరలోనే ప్రకటిస్తానని చెప్పారు. తనను ఆశీర్వదించి, తనతో పాటు నడవాలని ప్రజలను, ముఖ్యంగా విద్యార్థి నాయకులను ఆమె కోరారు.
తన రాజీనామా వెనుక ఉన్న బాధను వివరిస్తూ.. ఇది కేవలం రాజకీయ నిర్ణయం కాదని, తన ఆత్మగౌరవానికి సంబంధించిన విషయమని కవిత పేర్కొన్నారు. “నైతికత లేకపోతే మనుషులకు, జంతువులకు తేడా ఉండదు” అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. సొంత పార్టీలోనే అవమానాలు ఎదుర్కొన్నానని, అందుకే ఆ బంధాలను తెంచుకుని బయటకు వస్తున్నానని చెప్పారు. ఆదివాసీలు, గిరిజనులు, మహిళలు మరియు మైనారిటీల హక్కుల కోసం తన పార్టీ అండగా ఉంటుందని ఆమె హామీ ఇచ్చారు.
చివరగా, తనపై వస్తున్న ఆరోపణలను ఆమె తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు చేస్తున్న విమర్శల్లో నిజం లేదని.. ఇది ఆస్తుల కోసం చేస్తున్న పోరాటం కాదని యాదగిరి లక్ష్మీనరసింహ స్వామి సాక్షిగా ప్రమాణం చేశారు. తెలంగాణలో జరుగుతున్న అవినీతి, అక్రమ భూకబ్జాల గురించి గతంలోనే నాయకత్వానికి చెప్పినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తన రాజీనామా ఆమోదం పొందితే తనకు పూర్తి స్వేచ్ఛ వస్తుందని, అప్పుడు ప్రజల కోసం ఒక ‘వజ్రాయుధం’లా పనిచేస్తానని కవిత ప్రకటించారు.
