Kalpana: తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక విషాదకర ఘటన చోటుచేసుకుంది. ప్రముఖ గాయని కల్పన ఆత్మహత్యాయత్నం చేశారు. హైదరాబాద్‌లోని నిజాంపేటలో నివసిస్తున్న ఆమె, నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ విషయాన్ని గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను హుటాహుటిన సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
కల్పన తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ వంటి పలు భాషల్లో అనేక సూపర్ హిట్ పాటలు పాడి, శ్రోతలను మైమరపించారు. సింగర్‌గానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా, నటిగా కూడా ఆమె తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు.
కల్పన గతంలో కూడా ఆత్మహత్య చేసుకోవాలనుకున్నట్లు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. 2010లో విడాకులు పొందిన తర్వాత, ముగ్గురు పిల్లలను చూసుకోవాల్సిన బాధ్యతతో, ఆర్థిక సమస్యలతో, ఆమె ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారని తెలిపారు. అయితే, సింగర్ చిత్ర ఆమెకు ధైర్యం చెప్పి, జీవితంలో ముందుకు సాగేందుకు ప్రోత్సహించారని పేర్కొన్నారు.
ప్రస్తుతం కల్పన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో, ఆమె త్వరగా కోలుకోవాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

