Kalpana: ప్రసిద్ధ గాయని కల్పన తనపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారం జరుగుతోందని, వాస్తవాలు తెలుసుకోకుండా పోస్టులు పెట్టడం నిరోధించాలని కోరుతూ తెలంగాణ మహిళా కమిషన్‌ను ఆశ్రయించారు. ఇటీవల ఆమె నిద్రమాత్రలను అధిక మోతాదులో తీసుకోవడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లారు. అయితే, దీనిపై సోషల్ మీడియాలో ఆమె భర్త, కూతురు కారణంగానే ఆమె ఆత్మహత్యాయత్నం చేశారని కొంతమంది ప్రచారం చేయడం మొదలుపెట్టారు.
సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానళ్ల వేదికగా కల్పన ఆరోగ్యంపై అనేక రకాల కథనాలు వస్తుండటంతో, ఆమె ఈ తప్పుడు ప్రచారాన్ని ఆపాలని మహిళా కమిషన్‌ను కోరారు. తప్పుడు సమాచారం ప్రచారం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు
ఈ ఘటనపై తెలంగాణ మహిళా కమిషన్ చైర్మన్ స్పందిస్తూ, మహిళలపై అసత్య ఆరోపణలు చేసే, అసభ్యకర పోస్టులు పెట్టే వారిపై ప్రత్యేక దృష్టి పెట్టామని తెలిపారు. ఇష్టానుసారంగా తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.