Kaleshwaram

Kaleshwaram: ఎన్నో లోపాలు.. జస్టిస్ ఘోష్ నివేదికలో సంచలన నిజాలు!

Kaleshwaram: కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీల నిర్మాణంలో జరిగిన లోపాలు, అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ సమర్పించిన నివేదిక నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం తదుపరి కార్యాచరణకు సిద్ధమవుతోంది. ఈ కీలక నివేదికపై చర్చించేందుకు సోమవారం మధ్యాహ్నం అత్యవసర మంత్రివర్గ సమావేశం జరగనుంది. సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌) తయారీ నుండి నిర్మాణం, నాణ్యత, నిర్వహణ వరకు అనేక లోపాలు, అక్రమాలు జరిగినట్లు కమిషన్ స్పష్టం చేసింది. ఏ వైఫల్యానికి ఎవరు బాధ్యులో కూడా కమిషన్ నివేదికలో పేర్కొనడంతో, ప్రభుత్వ నిర్ణయాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

నివేదికలోని కీలక అంశాలు:
700 పేజీల ఘోష్ కమిషన్ నివేదికను అధ్యయనం చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముగ్గురు ఐఏఎస్ అధికారులతో ఒక కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ కమిటీ నివేదికలోని పలు అంశాలపై ప్రభుత్వానికి నివేదించినట్లు సమాచారం. వ్యక్తిగత నిర్ణయాలు, అప్పటి రాజకీయ నాయకత్వ ప్రభావంతో పరిపాలనా, ప్రణాళికల్లో అనేక లోపాలు జరిగాయని, సాంకేతిక అంశాలను విస్మరించారని కమిషన్ తన నివేదికలో పేర్కొందని కమిటీ అభిప్రాయపడింది.

బాధ్యులెవరు?
మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంలో భారీగా ప్రజాధనం దుర్వినియోగమైందని, ఇందులో అనేక మంది పాత్ర ఉందని న్యాయ కమిషన్ వివరంగా పేర్కొంది. గత ముఖ్యమంత్రి కేసీఆర్, అప్పటి మంత్రులు హరీశ్‌రావు, ఈటల రాజేందర్‌తో పాటు ఐఏఎస్‌ అధికారులు, సీనియర్‌ ఇంజినీర్లు, మాజీ ఈఎన్సీలు (మురళీధర్, నల్లా వెంకటేశ్వర్లు, నాగేందర్‌రావు, నరేందర్‌రెడ్డి), మాజీ సీఈలు (చంద్రశేఖర్, బసవరాజు), ప్రస్తుత ఈఎన్సీలు (టి.శ్రీనివాస్, హరిరాం), సీఈలు (సుధాకర్‌రెడ్డి, ప్రమీల) వంటి అనేక మంది పాత్ర గురించి కమిషన్ నివేదికలో వెల్లడించినట్లు తెలుస్తోంది.

ప్రధాన లోపాలు:

మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను నిర్మించాలన్నది ప్రభుత్వ నిర్ణయం కాదని, అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్, అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావులు వ్యక్తిగతంగా తీసుకున్న నిర్ణయాలని కమిషన్ పేర్కొంది.
మంత్రివర్గ అనుమతి లేకపోవడం.
తుమ్మిడిహెట్టి వద్ద తగినంత నీరు లభించదని పేర్కొంటూ, బ్యారేజీల నిర్మాణ స్థలాన్ని మార్చడం కూడా లోపంగా నివేదిక గుర్తించింది.
అంచనాల సవరింపులో అవకతవకలు.
నిర్వహణ సరిగా లేకపోవడం.
నీటిని మళ్లించడానికి నిర్మించిన బ్యారేజీలలో నీటిని నిత్యం నిల్వ ఉంచడం.
నిపుణుల కమిటీ నివేదికను పక్కనపెట్టడం.
డిజైన్లలో లోపాలు, నాణ్యతా తనిఖీలు లేకపోవడం.
పని పూర్తికాకుండానే పూర్తయినట్లు సర్టిఫికెట్‌ ఇవ్వడం.
ఆర్థిక పరిస్థితిని పట్టించుకోకుండా నిర్ణయాలు తీసుకోవడంలో అప్పటి ఆర్థికమంత్రి ఈటల రాజేందర్‌ను కూడా కమిషన్ తప్పుపట్టింది.
డీపీఆర్ (సమగ్ర ప్రాజెక్టు నివేదిక) తయారీకి కన్సల్టెన్సీ సేవలు అందించిన వాప్కోస్ సంస్థకు చెల్లించిన రూ. 6.77 కోట్లను తిరిగి రాబట్టాలని కూడా కమిషన్ ప్రభుత్వానికి సూచించింది.

ALSO READ  Pawan Warns Pak: మోడీ దృష్టికి పవన్‌ కళ్యాణ్‌ సంచలన స్టేట్మెంట్‌!

Also Read: Kaleshwaram Project: నివేదికలో కేసీఆర్, హరీష్ రావు పేర్లు.. కేబినెట్ నిర్ణయంపై ఉత్కంఠ..

నిర్మాణ సంస్థపై సిఫార్సులు:
మేడిగడ్డ బ్యారేజీ ఏడో బ్లాకును పూర్తిగా తొలగించి మళ్లీ నిర్మించడంతో పాటు మిగిలిన బ్లాకుల పరిస్థితిని పరిశీలించేందుకు అవసరమైన పరీక్షలు చేయాలని నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) సిఫార్సు చేసింది. నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ – పి.ఇ.ఎస్. జాయింట్ వెంచర్‌పై నేరపూరిత చర్యలు తీసుకోవాలని, అలాగే బ్యారేజీ పునరుద్ధరణకు అయ్యే ఖర్చును వారి నుండి వసూలు చేయాలని విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సిఫార్సు చేసింది. డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్‌లో వచ్చే లోపాలను సరిదిద్దే బాధ్యత నిర్మాణ సంస్థలదేనని అన్నారం, సుందిళ్ల బ్యారేజీల విషయంలో కూడా ఈ పని చేయాలని కమిషన్ పేర్కొంది. గత ఆరు నెలలుగా పునరుద్ధరణ, మరమ్మతుల ఖర్చు తమకు సంబంధం లేదని ఎల్‌ అండ్‌ టీ లేఖలు రాస్తున్న నేపథ్యంలో, కమిషన్ సిఫార్సులతో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.

తదుపరి చర్యలు:
కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ కార్పొరేషన్ లిమిటెడ్ (కె.ఐ.పి.సి.ఎల్) ద్వారా ఆర్థిక అవకతవకలు జరిగాయని, దీనికి బోర్డు సభ్యులు బాధ్యులని పేర్కొన్న న్యాయ కమిషన్, బోర్డులో ఉన్న నీటిపారుదల, ఆర్థికశాఖ అధికారులపై క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ కింద చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేసింది. మంత్రివర్గ సమావేశం అనంతరం ఈ నివేదికను సీఐడీకి అప్పగించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామాలన్నీ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించనున్నాయి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *