TG High Court: తెలంగాణ రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై ఏర్పాటు చేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ చెల్లుబాటుపై హైకోర్టులో నేడు కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కమిషన్ ఏర్పాటును సవాల్ చేస్తూ మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, ఐఏఎస్ అధికారిణి స్మితా సభర్వాల్ దాఖలు చేసిన పిటిషన్లపై నేడు వెలువడాల్సిన తుది తీర్పును ధర్మాసనం ఈ నెల 22వ తేదీకి వాయిదా వేసింది. మార్చి 12నే వాదనలు పూర్తి కాగా, జడ్జి తీర్పును రిజర్వ్ చేశారు. అయితే అనుహ్యంగా తీర్పు తేదీని ముందుకు జరపడంతో రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.
పిటిషనర్ల వాదనలు ఏమిటి?
కాళేశ్వరం ప్రాజెక్టులో అక్రమాలు జరిగాయని ప్రభుత్వం ముందే ఒక నిర్ణయానికి వచ్చి, రాజకీయ కక్షతోనే ఈ కమిషన్ వేసిందని పిటిషనర్లు కోర్టులో వాదించారు. ప్రధానంగా కేసీఆర్ తరపు న్యాయవాది ‘కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్’ నిబంధనల ఉల్లంఘనను ఎత్తిచూపారు:
నిబంధనల ప్రకారం ఇవ్వాల్సిన 8(B), 8(C) నోటీసులు తమకు అందలేదని తెలిపారు. సాక్షులను విచారించే సమయంలో తమకు క్రాస్ ఎగ్జామినేషన్ చేసుకునే అవకాశం కల్పించలేదని ఆరోపించారు. ఎలాంటి ప్రాథమిక విచారణ లేకుండానే అక్రమాలు జరిగాయని ప్రభుత్వం ఒక ముగింపుకు వచ్చి ఈ కమిషన్ నియమించిందని, అందుకే దీనిని కొట్టివేయాలని కోరారు.
ప్రభుత్వ కౌంటర్
మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం తన వాదనను బలంగా వినిపించింది. వేల కోట్లతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో ప్రజల ధనం వృధా అయిందని, ప్రజా ప్రయోజనాలను కాపాడటమే తమ లక్ష్యమని పేర్కొంది. ప్రాజెక్టు డిజైన్ల లోపాలు, కుంగిన మెడిగడ్డ పిల్లర్లు వంటి అంశాలపై లోతైన విచారణ అవసరమని, అందుకే సుప్రీంకోర్టు మాజీ జడ్జి నేతృత్వంలో ఈ కమిషన్ వేసినట్లు కోర్టుకు తెలిపింది.
ఈ నెల 22న వెలువడే తీర్పుపైనే ఈ కమిషన్ భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఒకవేళ కోర్టు కమిషన్ విచారణను సమర్థిస్తే, విచారణ వేగవంతం కానుంది. లేనిపక్షంలో ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాల్సి ఉంటుంది.
