Kakani Govardhan Reddy: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ప్రస్తుతం తుఫాను వల్ల పంటలు నష్టపోయిన రైతుల అంశంపై వేడెక్కాయి. మాజీ మంత్రి, వై.ఎస్.ఆర్.సి.పి. నాయకులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు, ప్రస్తుత వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు మరియు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రైతులకు అండగా నిలబడాల్సిన సమయంలో పాలకపక్షం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు.
విదేశీ పర్యటనలా? రైతు సమస్యలా?
రాష్ట్రంలో రైతులు తుఫానుల కారణంగా భారీగా పంట నష్టపోయి కష్టాల్లో ఉంటే, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కనీసం ఆ శాఖ గురించి పట్టించుకోవడమే మానేశారని కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆక్షేపించారు. రైతుల సమస్యలను గాలికి వదిలేసి, తండ్రీకొడుకులు ఇద్దరూ విదేశాలకు వెళ్లడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. ఈ సమయంలో రైతు నేతలతో, జిల్లా అధ్యక్షులతో జూమ్ మీటింగ్ ద్వారా మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు సమీక్ష చేసి, వారికి అండగా నిలబడేందుకు ప్రయత్నిస్తుంటే, దానిపై కూడా విమర్శలు చేయడం ఏంటని కాకాణి ప్రశ్నించారు.
Also Read: Rajahmundry: ఏపీలో అచ్చం శబరిమల లాంటి అయ్యప్ప ఆలయం! గోదావరి తీరాన కొలువై ఉన్న మణికంఠుడు
అచ్చెన్నాయుడికి బుద్ధి, సిగ్గు ఉందా? – కాకాణి సవాల్!
మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడే తీరు సరిగా లేదని, ఆయన ఒక వీధి రౌడీలా మాట్లాడుతున్నారని కాకాణి గోవర్ధన్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. అచ్చెన్నాయుడుకి బుద్ధి, సిగ్గు ఉందా అని ఘాటుగా ప్రశ్నించారు. ఒకవైపు సవాళ్లు విసిరి, దమ్ము లేనప్పుడు మళ్లీ మాట్లాడటం ఎందుకని కాకాణి ఎద్దేవా చేశారు. అన్ని రంగాల సమస్యలపై చర్చించడానికి తాము సిద్ధంగా ఉన్నామని, దమ్ము ఉంటే తనతో కలిసి ప్రజల్లోకి వచ్చి సమస్యలపై చర్చించాలని అచ్చెన్నాయుడుకి సవాలు విసిరారు. కూటమి పార్టీలకు చెందిన మంత్రులే ఒకరినొకరు విమర్శించుకుంటూ, చివరికి పవన్ కళ్యాణ్ కాళ్లు పట్టుకోవడం చూస్తుంటే అసెంబ్లీని చూసి ప్రజలు అసహ్యించుకునే పరిస్థితి వచ్చిందని ఆయన అన్నారు.
మిర్చి యార్డుకు ఎందుకు పోలేదు?
రైతుల గురించి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎందుకు మాట్లాడటం లేదని కాకాణి గోవర్ధన్ రెడ్డి ఈ సందర్భంగా ప్రశ్నించారు. ధరల స్థిరీకరణ నిధి గురించి అచ్చెన్నాయుడు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని, ఆయన మనిషి పెరిగాడు కానీ బుర్ర పెరగలేదని, రైతులు ఆయన్ని ఒక కమెడియన్‌గా చూసి నవ్వుకుంటున్నారని తీవ్రంగా విమర్శించారు. రైతులకు అండగా నిలవడానికి మంత్రి అచ్చెన్నాయుడుకి భయం పట్టుకుందని, అందుకే రైతులు తరిమి కొడతారనే భయంతోనే ఆయన మిర్చి యార్డుకు కూడా వెళ్లలేదని కాకాణి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు.

