Kadiyam srihari: స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్ఎస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇటీవల జరిగిన ఢిల్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఓటమికి బీఆర్ఎస్‌తో స్నేహమే కారణమని వ్యాఖ్యానించారు. ఆప్, కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేసిఉంటే ఖచ్చితంగా గెలిచేదని అభిప్రాయపడ్డారు.
బీఆర్ఎస్ పాలనపై తీవ్ర విమర్శలు
గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి ఏమీ చేయలేదని, దీంతో తెలంగాణ పూర్తిగా భ్రష్టుపట్టిపోయిందని ఆరోపించారు. రాష్ట్ర ప్రజలు ఇప్పుడు నిజాలు అర్థం చేసుకుని బీఆర్ఎస్‌కు గుణపాఠం చెప్పే సమయం ఆసన్నమైందని అన్నారు.
పార్టీ ఫిరాయింపులపై ఘాటైన వ్యాఖ్యలు
బీఆర్ఎస్ పార్టీకి ఫిరాయింపులపై మాట్లాడే నైతిక హక్కు లేదని స్పష్టం చేశారు. గతంలో బీఆర్ఎస్ే ఫిరాయింపులను ప్రోత్సహించిందని, ఆ పార్టీ అధినేతలు తమ గతాన్ని ఒకసారి పరిశీలించుకోవాలని హితవు పలికారు.
“మీరు చేస్తే సంసారం… మరొకరు చేస్తే వ్యభిచారమా?”
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి తమ పార్టీలో చేర్చుకొని మంత్రులుగా చేసిన ఘనత బీఆర్ఎస్‌దే కాదా?” అని ప్రశ్నించారు. ఇప్పుడు మాత్రం తాము శుద్ధపూసల్లా మాటలాడడం సరైంది కాదని విమర్శించారు. “మీరు చేస్తే సంసారం, మరొకరు చేస్తే వ్యభిచారమా?” అని ఘాటుగా వ్యాఖ్యానించారు.
ఉప ఎన్నికలకు సిద్ధంగా ఉన్నా
ప్రస్తుతం ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ సుప్రీంకోర్టులో విచారణలో ఉందని, ఏ తీర్పు వచ్చినా పాటిస్తానని స్పష్టం చేశారు. ఉప ఎన్నికలు వస్తే ధైర్యంగా ఎదుర్కొంటానని కడియం శ్రీహరి ధీమా వ్యక్తంచేశారు.