Kaantha: నటులు దుల్కర్ సల్మాన్, రానా ఇద్దరికీ చిత్ర నిర్మాణ రంగంతోనూ అనుబంధం ఉంది. నట వారసులైన వీరు వివిధ భాషాచిత్రాలలో నటిస్తున్నారు. విశేషం ఏమంటే తాజాగా ‘కాంత’ అనే మూవీని వీరిద్దరూ కలిసి నిర్మించడంతో పాటు అందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ‘మిస్టర్ బచ్చన్’ ఫేమ్ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను 1950 నాటి కథాంశంతో సెల్వమణి సెల్వరాజ్ తెరకెక్కిస్తున్నారు. గత యేడాది ద్వితీయార్థంలో సెట్స్ పైకి వెళ్ళిన ‘కాంత’ చిత్రీకరణ తాజాగా పూర్తయ్యింది. వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ నూ మేకర్స్ మొదలు పెట్టేశారు. ఈ యేడాది వేసవిలో ఈ చిత్రాన్ని జనం ముందుకు తెచ్చే ఆలోచన చేస్తున్నారు. ‘మహానటి, సీతారామం, లక్కీ భాస్కర్’తో తెలుగులో హ్యాట్రిక్ సాధించిన దుల్కర్ సల్మాన్ కు ‘కాంత’ ఎలాంటి విజయాన్ని అందుస్తుందో చూడాలి.
