Kaantha Movie Review: 1950ల కాలాన్ని తెరపై మరోసారి సజీవం చేస్తూ రూపొందిన ‘కాంత’ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దుల్కర్ సల్మాన్, సముద్రఖని, రానా దగ్గుబాటి, భాగ్యశ్రీ బోర్సే ముఖ్యపాత్రల్లో నటించిన ఈ చిత్రం విడుదలైన వెంటనే సినీప్రేమికుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. పీరియడ్ నేపథ్యంతో సాగిన ఈ కథలో నటీనటుల ప్రదర్శనలు, ఆ కాలపు సినిమా వాతావరణాన్ని కచ్చితంగా చూపించిన తీరు ప్రత్యేకంగా నిలిచాయి.
కథలో ఓ ప్రముఖ దర్శకుడు ఒక అనాధ బాలుడిని హీరోగా తీర్చిదిద్దడం, అతడి ఎదుగుదలతో వచ్చిన ఈగో క్లాష్, చిత్రీకరణలో ఏర్పడే విభేదాలు, హీరోయిన్ ఎదుర్కొనే ఒత్తిడులు వంటి సంఘటనలు సినిమాకి హృదయంగా నిలుస్తాయి. దర్శకుడు అయ్య పాత్రలో సముద్రఖని, కాలానికి తగ్గ గంభీరతతో కనిపిస్తే, మహదేవన్‌గా దుల్కర్ సల్మాన్ సహజత్వంతో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకుంటాడు. ముఖ్యంగా రెండో భాగంలో అతడి నటన మరింత ప్రభావవంతంగా ఉంటుంది. హీరోయిన్ కుమారి పాత్రలో నటించిన భాగ్యశ్రీ బోర్సే భావోద్వేగ సన్నివేశాల్లో బాగా మెరిసింది. పోలీస్ ఆఫీసర్‌గా రానా ఎంట్రీ కథకు కొత్త మలుపు తీసుకొచ్చి, హత్య రహస్యాన్ని బయటపెట్టే దర్యాప్తులో తనదైన స్టైల్లో ప్రభావం చూపాడు.
Also Read: Anirudh-Kavya Maran: కావ్య మారన్‌తో అనిరుధ్ సీక్రెట్ ట్రిప్.. మళ్లీ ట్రెండ్‌లోకి..!
సినిమాలో దర్శకుడు సెల్వమణి సెల్వరాజ్ 1950ల వాతావరణాన్ని తిరిగి సృష్టించిన తీరు ప్రత్యేకంగా నిలుస్తుంది. ఆ కాలపు చిత్రీకరణ శైలి, నటన, స్టూడియో వాతావరణం అన్నీ నిజ జీవితానికి దగ్గరగా చూపించబడ్డాయి. అయితే రెండో భాగంలో దర్యాప్తు ఎపిసోడ్ కొంతసేపు నెమ్మదిగా సాగినప్పటికీ, చివర్లో వచ్చే ట్విస్ట్‌లు ఆసక్తిని నిలుపుతాయి. సాంకేతిక విభాగం విషయానికి వస్తే సినిమాటోగ్రఫీ సినిమాకే ప్రాణంలా పనిచేసింది. నేపథ్య సంగీతం కాలానుగుణంగా ఉండి దృశ్యాలను మరింత చైతన్యవంతం చేశాయి. నిర్మాణ విలువలు కూడా పెద్ద చిత్రాలకు తప్పనిసరిగా ఉండే నాణ్యతను చూపించాయి.
పీరియాడిక్ డ్రామాలను ఇష్టపడే ప్రేక్షకులకు ఈ సినిమా మంచి అనుభూతిని ఇస్తుంది. కమర్షియల్ ఎలిమెంట్స్ పెద్దగా లేకపోవడం వల్ల సాధారణ ప్రేక్షకులకు కొంత నెమ్మదిగా అనిపించినా, కథలోని లోతు, నటన, ఆకట్టుకునే తెరకెక్కింపు ‘కాంత’ను ప్రత్యేక చిత్రంగా నిలబెట్టాయి. దుల్కర్ తెలుగులో వరుస విజయాలతో నిలుస్తూ, ఈ సినిమాతో మరొకసారి తన నటనను రుజువు చేసుకున్నాడు.

