Supreme Court: భారత అత్యున్నత న్యాయస్థానం (సుప్రీంకోర్టు) కొత్త శకంలోకి అడుగుపెట్టింది. భారతదేశ 53వ ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)గా జస్టిస్ సూర్యకాంత్ సోమవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాష్ట్రపతి భవన్లో జరగనున్న ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయన చేత ప్రమాణం చేయించనున్నారు.
ప్రమాణస్వీకారానికి అపూర్వ అతిథులు
ఈరోజు జరగనున్న ప్రమాణస్వీకారం కార్యక్రమం ఒక అరుదైన మైలురాయిగా నిలవనుంది. ఈ వేడుకకు దేశంలోని అత్యున్నత నాయకులతో పాటు అంతర్జాతీయ న్యాయ ప్రముఖులు హాజరు కానున్నారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. దేశ చరిత్రలో తొలిసారిగా సీజేఐ ప్రమాణస్వీకారం కార్యక్రమానికి వివిధ దేశాల సుప్రీంకోర్టు న్యాయమూర్తులు హాజరు కావడం ఈ వేడుకకు ప్రత్యేకతను తెచ్చిపెట్టనుంది.
పదవీ కాలం, కీలక నియామకం
జస్టిస్ సూర్యకాంత్ దాదాపు 15 నెలల పాటు భారత ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వహించనున్నారు. ఆయన పదవీ కాలం 2027 ఫిబ్రవరి 9 వరకు కొనసాగనుంది.
నవంబర్ 23న జస్టిస్ బీఆర్. గవాయ్ పదవీ విరమణ చేసిన అనంతరం, తదుపరి సీజేఐగా జస్టిస్ సూర్యకాంత్ పేరును ప్రతిపాదించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 124లోని క్లాజు (2) ద్వారా ఆయన ఈ కీలక పదవికి నియమితులయ్యారు.
ఇది కూడా చదవండి: Bigg Boss 9 Telugu: ‘బాండింగ్’ పాలిటిక్స్ వర్సెస్ ఎలిమినేషన్ డ్రామా! దివ్య సేఫ్, రీతూ కెప్టెన్సీ వెనుక అసలు కథ!
జస్టిస్ సూర్యకాంత్ ప్రస్థానం: సామాన్యుడి నుంచి అత్యున్నత పీఠం వరకు
జస్టిస్ సూర్యకాంత్ ప్రస్థానం ఎంతో స్ఫూర్తిదాయకం. హర్యానాలోని ఒక మధ్యతరగతి కుటుంబంలో ఫిబ్రవరి 10, 1962న జన్మించిన ఆయన.. 1984లో హిసార్‌లో న్యాయవాద వృత్తిని ప్రారంభించి, ఆ తర్వాత పంజాబ్, హర్యానా హైకోర్టులో ప్రాక్టీస్ చేశారు. అయన జూలై 2000లో హర్యానాకు అతి పిన్న వయస్కుడైన అడ్వకేట్ జనరల్‌గా నియమితులయ్యారు. తర్వాత 2001లో సీనియర్ న్యాయవాదిగా బాధ్యతలు చేపట్టారు. జనవరి 9, 2004న పంజాబ్-హర్యానా హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. అక్టోబర్ 2018 నుండి మే 2019 వరకు హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు.
సుప్రీంకోర్టు ప్రవేశం.. మే 24, 2019న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందిన ఆయన, నవంబర్ 2024 నుంచి సుప్రీంకోర్టు న్యాయ సేవల కమిటీ ఛైర్మన్‌గా కూడా పనిచేస్తున్నారు.
న్యాయ రంగంలో నాలుగు దశాబ్దాలకు పైగా విశేష అనుభవం కలిగిన జస్టిస్ సూర్యకాంత్, ఇప్పుడు దేశ అత్యున్నత న్యాయ పీఠాన్ని అధిరోహించారు. ఆయన నేతృత్వంలో సుప్రీంకోర్టు తీసుకునే నిర్ణయాలు, సంస్కరణలు దేశ న్యాయవ్యవస్థకు దిశా నిర్దేశం చేయనున్నాయి.
